RS Praveen Kumar : సీఎం రేవంత్ ఫై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు
మీరు గేట్లు తెరిస్తే మీ వద్దకు గొర్రెలు వచ్చాయని... అదే మేం గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని సినిమా డైలాగ్ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు
- By Sudheer Published Date - 09:36 PM, Sat - 23 March 24

మేం గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సెటైర్లు వేశారు. మీరు గేట్లు తెరిస్తే మీ వద్దకు గొర్రెలు వచ్చాయని… అదే మేం గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని సినిమా డైలాగ్ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. నిజమైన తెలంగాణవాదులు బీఆర్ఎస్‌లో ఉన్నారని… తెలంగాణను మోసం చేసిన వాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళంతా గేట్లు తోసుకుని అక్కడకు పోతున్నారని ఎద్దేవా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు కేకే, బాల్క సుమన్, రావుల చంద్రశేఖర్ తదితరుల సమక్షంలో బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చారిత్రాత్మికమని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగమని వ్యాఖ్యానించారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐ అన్నింటినీ మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని అన్నారు. రాజ్యాంగం రద్దయితే మనకు రిజర్వేషన్లు ఉండవని.. దళిత బిడ్డల బతుకు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చిందని , రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా తన పోరాటం ఆపేది లేదని… పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అనే ఆయుధంతో బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Read Also : AP : మహాసేన రాజేష్ కు బిగ్ షాక్..పి.గన్నవరం టికెట్ జనసైనికుడికే