Musi victims : మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 : కలెక్టర్ ప్రకటన
Musi victims : మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా మరో ప్రాంతానికి తరలి వెళ్లే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు రూ.25 వేల నగదును ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
- By Latha Suma Published Date - 02:17 PM, Wed - 2 October 24

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 చెల్లింపు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా మరో ప్రాంతానికి తరలి వెళ్లే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు రూ.25 వేల నగదును ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్లే వారికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 చెల్లింపు చేస్తే.. వారు శాంతిస్తారని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోందట. కానీ.. మూసీ నిర్వాసితులు… ఒక్కొక్కరికి రూ.50 లక్షలు అడుగుతున్నారు. కాగా మధ్యాహ్నం 3గంటలకు మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులవుతున్న కుటుంబాలను పరామర్శించనున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంబర్‌పేట్ అసెంబ్లీ ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను వారి కుటుంబాలను కలుస్తారు.
కాగా, మూసీ ప్రక్షాళన దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి నదీ గర్భంలో ఉన్న ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు, నిర్వాసితుల వివరాలను సేకరించారు. మరో చోట రెండు పడకగదుల ఇళ్లను కేటాయించి పరిహారం చెల్లించాకే మార్కింగ్ చేసిన ఇళ్లను తొలిగింపు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.