Tiger Scare: తెలంగాణ ఏజెన్సీని వణికిస్తున్న పెద్దపులి…?
తెలంగాణ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పెద్దపులి భయంపట్టుకుంది. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తయైయ్యారు. పులిని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు.
- Author : Hashtag U
Date : 03-12-2021 - 10:23 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పెద్దపులి భయంపట్టుకుంది. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తయైయ్యారు. పులిని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ఇటీవలి కాలంలో కొత్తగూడ, పాకాల అటవీ ప్రాంతాల్లో పులి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో అటవీశాఖ అధికారులు రాత్రి వేళల్లో అటవీ ప్రాంతానికి వెళ్లే అన్ని రహదారులను మూసివేస్తున్నారు.అత్యవసరమైన వాహనాలను గుంజేడు వైపు మళ్లిస్తున్నారు.
పాకాల-కొత్తగూడ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే భారీ వాహనాన్ని అనుమతిస్తున్నారు. గాంధీ నగర్ నుంచి మహబూబాబాద్ పట్టణానికి గత రాత్రి నుంచే పలు వాహనాలను తిప్పి పంపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో పులి గుర్తులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి బుధవారం అర్థరాత్రి పెద్ద పులి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నామని అటవీశాఖ అధికారి తెలిపారు.
పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పులి ఆచూకీ దొరకకపోవడంతో ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఏ క్షణంలో ఎటునుంచి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.