Value of Water : రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదు – హరీశ్
Value of Water : రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.
- By Sudheer Published Date - 06:40 PM, Sun - 17 August 25

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నీళ్ల విలువ తెలియదని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయవద్దని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ వాటికి నష్టం కలిగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఇలా చేస్తే మోటార్లు పాడైపోతాయని, వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని బీహెచ్ఈఎల్ కూడా హెచ్చరించిందని ఆయన పేర్కొన్నారు. మోటార్లు దెబ్బతింటే దానిని బీఆర్ఎస్ పార్టీపై నెట్టాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పాడుపెట్టిందని, ఇప్పటికైనా బురద రాజకీయాలు మానేసి వరద నీటిని ఒడిసి పట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Surrogacy Case : మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే నిజాలు
రైతు ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని హరీశ్‌రావు విమర్శించారు. కమీషన్లకు, వాటాలకు సమయం సరిపోతోందని, ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపించారు. నంది మేడారంలో స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీరు మిడ్ మానేరులోకి వస్తుందని, ఈ విషయాన్ని వారం క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేశానని హరీశ్‌రావు తెలిపారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లు తెరిచి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసే రైతు కాబట్టి ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టి రైతులకు అందించారని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వ్యవసాయం చేయలేదు కాబట్టి వారికి నేల విలువ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా కూడా కళ్లప్పగించి చూడడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.