Governor : గవర్నర్ ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన రాజ్‌భవన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
- By Latha Suma Published Date - 06:50 PM, Mon - 20 January 25

Governor : తెలంగాణ గవర్నర్ కార్యాలయం గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను వెల్లడించింది. వివిద రంగాలలో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈనెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
అవార్డుకు ఎంపికైన వారిలో దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజీ దీప్తి, ప్రొఫెసర్ ఎం.పాండురంగరావు-పీ.బీ.కృష్ణభారతికి సంయుక్తంగా, ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్‌ను ఎంపిక చేశారు. అవార్డు కింద రూ.2 లక్షలతో పాటు జ్ఞాపికను అందిస్తారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాలలో గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిబా పురస్కారాలు ఇవ్వనున్నట్టు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీలలో ఈ అవార్డులు ఉంటాయన్నారు.
కాగా, ఇటీవల గవర్నర్ ప్రతిభా పురస్కారాల(2024)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గత ఐదేళ్లుగా విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి విభాగంలో రెండు కేటగిరీల్లో అవార్డులు ఉంటాయి. ఒకటి వ్యక్తిగతంగా విజయం సాధించిన వారి కోసం, రెండో కేటగిరీలో ఆయా విభాగాల్లో కృషి చేసిన సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన వివరించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నవంబరు 23 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందేలా పంపించాలన్నారు. జనవరి 26న రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందిస్తారని తెలిపారు.