Rahul Gandhi Yatra: టీకాంగ్రెస్ కు షాక్.. మునుగోడుకు రాహుల్ దూరం!
రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర దీపావళి తర్వాత తెలంగాణలో కొనసాగనుంది.
- By Balu J Published Date - 07:31 PM, Sun - 9 October 22

రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర దీపావళి తర్వాత తెలంగాణలో కొనసాగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన రూట్ మ్యాప్ ఖరారు చేస్తోంది. షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే రాహుల్ తెలంగాణలో అడుగుపెడతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి బైజు, భారత్ జోడో యాత్ర సమన్వయకర్త సుశాంత్ మిశ్రా పార్టీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రోడ్‌మ్యాప్‌పై నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబరు 23న రాహుల్ గాంధీ మక్తల్ మీదుగా తెలంగాణలోకి అడుగుపెట్టనుండగా, దీపావళి సందర్భంగా ఆయనకు రెండు రోజులు విరామం లభించనుంది. దీపావళి తర్వాత అక్టోబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. రాహుల్ పర్యటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు మధు యాష్కీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క నేతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరుకునే సమయంలోనే రాహుల్ యాత్ర కూడా జరగనుండడం ఒక ఆసక్తికరమైన విషయం. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. కాబట్టి చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ పర్యటనతో బిజీబిజీగా ఉండటంతో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం యాత్ర కారణంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. రాహుల్ యాత్ర తెలంగాణలో ఉంటున్నప్పటికీ మునుగోడు ప్రచారంలో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు పలువురు.