KTR : ఆశా వర్కర్లపై చేయిచేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి : కేటీఆర్
ఆశావర్కర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆశావర్కర్లు సేవలందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టారు.
- By Latha Suma Published Date - 03:26 PM, Tue - 10 December 24

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శించారు. ఎవరికీ భయపడవద్దని, మీకు మేం అండగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన వారికి ధైర్యం చెప్పారు. అందరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆశావర్కర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆశావర్కర్లు సేవలందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేస్తాం. ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి. ఆశా వర్కర్ల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం అని కేటీఆర్ అన్నారు.
ఆశా వర్కర్లేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా? అన్నికేటీఆర్ అన్నారు. జీతం పెంచుతామని, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు… మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి వస్తే.. మీరు చేసిన దుశ్శాసన పర్వం ఆడబిడ్డలు మర్చిపోరన్నారు. ఖాకీ యూనిఫాం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. వదిలిపెట్టబోమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆశా వర్కర్లకు అండగా ఉంటాం.. వారితో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట కూడా కొట్లాడుతామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాకా.. మేము పోరాడుతామని కేటీఆర్ భరోసా కల్పించారు.
కాగా, సోమవారం హైదరాబాద్‌లో ఆశావర్కర్‌లు ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ధర్నాలో ఉన్న ఆశావర్కర్లను చెదరగొట్టేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలు అన్న గౌరవం లేకుండా మగ పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. దుర్భాషలాడారు. పోలీసుల దాడిలో గాయపడిన పలువురు ఆశావర్కర్లు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిని కేటీఆర్ పరామర్శించారు.
Read Also: R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య