Women Federation : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్‌లలో మహిళలను ప్రోత్సహిస్తాం.
- By Latha Suma Published Date - 03:54 PM, Fri - 21 February 25

Women Federation : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
Read Also: Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్
అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్‌లలో మహిళలను ప్రోత్సహిస్తాం. మహిళలు వ్యాపారంలో వేగంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నాం. దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషం. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామని తెలిపారు.
గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి. నిధులు నేనిస్తా.. నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. నిధులు ఇచ్చినా నిర్వహణ బాగాలేకపోతే ప్రయోజనం ఉండదు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తున్నామో బడి కూడా అలాగే నిర్వహించాలి అని రేవంత్‌రెడ్డి అన్నారు. తొలుత ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.