KTR Warangal Tour : వరంగల్ లో కేటీఆర్ టూర్ పై విపక్షాల అటాక్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ టూర్ ఉద్రిక్తంగా మారింది. ఆయన పర్యటనను అడ్డుకోవటానికి బీజేపీ నేతలు ముందుకు కదిలారు.
- By CS Rao Published Date - 02:18 PM, Wed - 20 April 22

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ టూర్ ఉద్రిక్తంగా మారింది. ఆయన పర్యటనను అడ్డుకోవటానికి బీజేపీ నేతలు ముందుకు కదిలారు. బుధవారం నాడు వరంగల్, హనుమకొండ, నర్సంపేట పర్యటనలో భాగంగా రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఓరుగల్లు నగరం అంతా గులాబీ మయంగా మారింది. కేటీఆర్ పర్యటన సక్సెస్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తుంటే, కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి బీజేపీ నేతలు రెడీ కావడంతో టెన్షన్ నెలకొంది.
గతంలో ఒకసారి మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు ఏ విధమైన అభివృద్ధి చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డు పడి బిజెపి కార్యకర్తలు నల్లజెండాలతో తమ నిరసనను తెలియజేశారు. ఇక హన్మకొండలోనూ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. తాజాగా జరుగుతున్న పర్యటనను కూడా అడ్డుకునేందుకు బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు.మంత్రి కేటీఆర్ కు ప్రజల సమక్షంలోనే తమ నిరసన తెలియజేయాలని బిజెపి నేతలు రెడీ అయ్యారు. వరంగల్ ,హనుమకొండ జిల్లాలకు ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఈ రెండు జిల్లాలలో అభివృద్ధి శూన్యంగా పరిస్థితి ఉందని బిజెపి నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సరిగా సద్వినియోగం చేసుకోకుండా వరంగల్ నగరాన్ని అభివృద్ధి శూన్యంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.కేటీఆర్ పర్యటన నేపధ్యంలో ప్రతిపక్షాల ఫోకస్ ఇలా ఉంటే ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని గులాబీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాషాయ దండు వ్యూహాత్మకంగా తమ నిరసన తెలియజెయ్యాలని చేస్తోన్న ప్రయత్నానికి పోలీసులు అడ్డుపడ్డారు. రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటన పై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దృష్టి సారించారు. ఫలితంగా ఉద్రికత్త నడుమ కేసీఆర్ పర్యటన కొన్ని వందల మంది పోలీసు బందోబస్తుతో నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్న మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.