CM KCR: రెండో రోజూ కేసీఆర్ యాగం, రాజశ్యామల పూజలో సీఎం దంపతులు
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాజశ్యామలా యాగం చేస్తున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 04:25 PM, Thu - 2 November 23

CM KCR: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాజశ్యామలా యాగం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికల ముందు యాగం చేయడం తెలంగాణలో చర్చనీయాంశమవుతోంది. యాగంలో భాగంగా రెండో రోజు ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు.
మొదటిరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన 170 మంది పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు. ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేపట్టారని, రాజులతోపాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అని స్వరూపానందేంద్రస్వామి తెలిపారు.
రుద్ర, చండీ, వనదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని, రాజశ్యామల యాగం విశిష్టమైనదని యాగం ప్రాధాన్యం వివరించారు. రాజులతోపాటు సామాన్యులను అనుగ్రహించే రాజశ్యామల యాగం కఠినమైన బీజాక్షరాలతో కూడినదని చెప్పారు. అధికారంలో కోసం యాగం చేయడం ఎప్పట్నుంచో కొనసాగుతున్న ఆనవాయితీ. గతంలో రాజులు కూడా యుద్దాలకు ముందే ముఖ్యమైన యాగాలు చేసేవారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రత్యేక యాగం చేయడం కూడా ఆసక్తిని రేపుతోంది.
Also Read: Telangana Assembly Polls: తెలంగాణలో కీలక ఘట్టం, రేపే ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ షురూ!