Telangana Assembly Polls: తెలంగాణలో కీలక ఘట్టం, రేపే ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ షురూ!
- Author : Balu J
Date : 02-11-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Assembly Polls: ఒకవైపు ప్రధాన పార్టీలు అభ్యర్థులు జాబితా, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తుంటే మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది. నోటిఫికేషన్ వెలువడడంతోనే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు పరిశీలిన, 15వ తేదీతో ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. అనంతరం ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలిపోనుంది.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం బృందం బుధవారం సమీక్షించింది. ఇప్పటి వరకు జరిగిన ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లను, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను తెలుసుకోవడానికి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్‌లతో కూడిన బృందం ఎన్నికలకు సంబంధించి వారు అనేక సూచనలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాలకు ఏ రాజకీయ నాయకులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అయితే నామినేషన్ ప్రక్రియలో ఈసీ జారీ చేసిన అంశాలు ప్రతి పార్టీ అభ్యర్థి పాటించాల్సి ఉంటుంది.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్న అభ్యర్థికి అయినా అర్హత ఉంటుంది. అయితే సదరు అభ్యర్థిని బలపరిచే వ్యక్తులు మాత్రం స్థానిక ఓటర్లై ఉండాలి. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్‌ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్ తిరస్కరించే అధికారం ఉంటుంది.
Also Read: Rayalaseema: కరువు కోరల్లో రాయలసీమ.. రైతన్నలు విలవిల!