బుడ్డిపేట బుల్లోడి గూట్లో మోత్కుపల్లి..ఒకే వరలో రెండు కత్తులు..కేసీఆర్, నరసింహులు
- By Hashtag U Published Date - 02:14 PM, Tue - 19 October 21

“చప్పుడు చేయకు కేసీఆర్. నీలాంటి లత్కోరుగాని ఇంటికి, పనికిమాలిన వాటి ఇంటికి, ఈ వెధవ ఇంటికి మేము వస్తామా? అంత చేవ చచ్చిన వాళ్లమా? మా ఇళ్ల చుట్టూ తిరిగి పైకి వచ్చినవాడివి. మా దగ్గరకొచ్చి పనులు చేయించుకున్న వాడివి. కనీసం స్నేహితులనే ఇంగిత జ్ఞనం లేకుండా మాట్లాడుతున్నావు. టీడీపీ పెట్టిన భిక్షవల్ల బతుకుతున్నావు. అది మరచిపోయి ఇవాళ మాట్లాడుతున్నావు.“ …ఇలా టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నరిసింహులు కేసీఆర్ పై వాడిన పదజాలం. ఆంధ్రా మూలాలున్న కేసీఆర్ తెలంగాణ వాడు కాదని పలుమార్లు మీడియాకు ఆధారాలను ఇచ్చాడు. విజయనగరం జిల్లా బుడ్డిపేట మూలాలను వెలికితీసిన సీనియర్ లీడర్ మోత్కుపల్లి. ఆనాడు బడ్డిపేట బుల్లోడు అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఒంటికాలు మీద కేసీఆర్ పై మండిపడిన టీడీపీ లీడర్లలో మొదటి వరుసలో నరసింహులు ఉన్నాడు.
బండ్లు ఓడలు..ఓడలు బళ్లు అనే పోలిక సహజంగా రాజకీయాల్లో వాడుతుంటారు.ఇప్పుడు మోత్కుపల్లి, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కూడా అలాగే ఉంది. ఎన్టీఆర్ కు ఇష్టమైన లీడర్లుగా కేసీఆర్, మోత్కుపల్లికి ఆనాడు గుర్తింపు ఉండేది. కేసీఆర్ 1983లో ఓడిపోయాడు. ఇంచుమించు అప్పుడే మోత్కుపల్లి ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. కేసీఆర్ కంటే ముందుగానే పలు కీలక పదవులను నిర్వహించాడు. ఇద్దరూ టీడీపీలో సుదీర్ఘ ప్రయాణం చేశారు. మోత్కుపల్లి కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. ఆనాడు రాజకీయంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ కు మాట సహాయం పలుమార్లు చేశాడని టీడీపీ వర్గాల్లో చెప్పుకుంటారు. పలువురి వద్ద కేసీఆర్ సహాయం పొందాడని, అదే తరహాలో మోత్కుపల్లి వద్ద కూడా సహాయం పొందాడట.
ఎన్టీఆర్ మనసును దోచుకున్న లీడర్లు చాలా మంది ఉన్నారు. వాళ్లలో కేసీఆర్, మోత్కుపల్లి ప్రధమ స్థానంలో ఉంటారు. టీడీపీ అధికార మార్పిడి 1995లో జరిగిన తరువాత ఎన్టీఆర్ మానసపుత్రులకు ఇబ్బందులు ప్రారంభం అయ్యాయని చెబుతుంటారు. ఆ జాబితాలో వీళ్లిద్దరూ ఉన్నారు. రెండోసారి సీఎం అయిన తరువాత చంద్రబాబు క్యాబినెట్ లో కేసీఆర్ కు స్థానం లభించలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ ఆఫర్ మాత్రమే ఇచ్చారు. కొన్నాళ్లు అలాగే కొనసాగిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బాట పట్టారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. సెంటిమెంట్ ను రాజేసి, ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబును టార్గెట్ ను చేశాడు. ఆ సమయంలో మోత్కుపల్లితో పాటు పలువురు కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాన్ని అడ్డుకోవడానికి నడుంబిగించారు. తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీతో 2004లో కేసీఆర్ జత కట్టాడు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆనాటి నుంచి తెలంగాణ వాదానికి కేసీఆర్ మరింత పదును పెట్టాడు. పలుమార్లు ఉప ఎన్నికలకు వెళ్లి వైఎస్ లాంటి వాళ్లను కూడా ఎదిరించాడు. ఆ సమయంలో తెలంగాణ వాదం తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై సమస్యగా మారింది. సరిగ్గా అప్పుడే మోత్కుపల్లి, కేసీఆర్ మీద రాజకీయ దాడి మొదలుపెట్టాడు. అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేలా అధినేత చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చాడట. బాస్ ఆదేశం మేరకు టీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాల మీద తరచూ ఎదురుదాడి చేశాడు. కేసీఆర్ మూలాల మీద, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఏకిపారేశాడు. అదే పంథాను టీడీపీలో ఉన్న చివరి రోజుల వరకు కొనసాగించాడు. ఆ తరువాత చంద్రబాబుతో విభేదించి బీజేపీలోకి వెళ్లాడు మోత్కుపల్లి.
సీనియర్ పొలిటిషియన్ గా ఉన్న మోత్కుపల్లికి బీజేపీ ఆయన ఊహించినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా కొన్ని సందర్భాల్లో అవమానం పడ్డాడు. ఉన్నత వర్గాల పార్టీగా బీజేపీని భావించాడు. అలాంటి తరుణంలో చిరకాల మిత్రుడు కేసీఆర్ స్నేహహస్తం అందించాడు. అప్పటి వరకు దళిత వ్యతిరేకిగా కేసీఆర్ ను భావించిన మోత్కపల్లి దళిత బంధు ప్రకటించిన తరువాత మనసు మార్చుకున్నాడు. ఏకంగా తెలంగాణ అంబేద్కర్ అంటూ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. చిరకాల మిత్రులు ఒక గూటికి చేరారు. పాత జ్ఞపకాలను వేదిక మీద నెమరు వేసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి అనుభవాన్ని ప్రస్తుత సంక్షోభ పరిష్కారం కోసం వాడుకుంటామని కేసీఆర్ ప్రకటించాడు. మొత్తం మీద ఎన్టీఆర్ మనుషులుగా పేరున్న వీళ్లద్దరూ మూడు దశాబ్దాల తరువాత ఒకటయ్యారు. మరి, ఒకే వరలో రెండు కత్తులు ఇముడుతాయా? లేదా అనేది భవిష్యత్ నిర్ణయించాలి.
Related News

Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు
కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది,గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది,ఇరాక్‌లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.