Good News : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్
Good News : తెలంగాణలో మొత్తం 2,298 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాలు, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, వీటి మొత్తం వ్యయం రూ.32,946 కోట్లు అని తెలిపారు
- By Sudheer Published Date - 09:23 AM, Thu - 3 April 25

హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నగర ప్రజారవాణా వ్యవస్థలో ఎంఎంటీఎస్ (MMTS) ట్రైన్లు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నా పెద్ద వ్యాపారులు, కార్మికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు ఈ ట్రైన్లను ఉపయోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సేవలు నగర శివార్లలోని ప్రజలకు మరింత అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి మరింత మెరుగైన రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Railway Minister Ashwini Vaishnaw) కీలక ప్రకటన చేశారు.
Drug Peddler: కేరళలో పట్టుబడిన మహిళా డ్రగ్ స్మగ్లర్.. కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు?
లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో రూ.1,169 కోట్ల విలువైన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు వేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ రూ.279 కోట్ల వాటా చెల్లించాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 82 కిలోమీటర్ల పొడవైన ఆరు ప్రధాన రైల్వే మార్గాలను ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో చేర్చినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఘట్‌కేసర్-మౌలాలి, ఫలక్‌నుమా-ఉమ్దానగర్, సనత్‌నగర్-మౌలాలి బైపాస్ లైన్, తెల్లాపూర్-రామచంద్రాపురం కొత్త లైన్, మేడ్చల్-బొల్లారం డబ్లింగ్, సికింద్రాబాద్-బొల్లారం విద్యుదీకరణ వంటి మార్గాల్లో పనులు జరుగుతున్నాయి.
అదనంగా ఘట్‌కేసర్-యాదాద్రి (Yadadri) మధ్య 33 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైన్ నిర్మాణానికి 2016లో రూ.412 కోట్లు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలంగాణలో మొత్తం 2,298 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాలు, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, వీటి మొత్తం వ్యయం రూ.32,946 కోట్లు అని తెలిపారు. అందులో ఇప్పటివరకు రూ.9,958 కోట్లు వెచ్చించి 474 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన రైలు సదుపాయాలు అందుబాటులోకి రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.