MLA Rajasingh: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్
అందుకే ప్రజల ముందు పెడుతున్నా’’ అని రాజాసింగ్(MLA Rajasingh) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 03:35 PM, Sat - 22 March 25

MLA Rajasingh: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే.. రాబోయే అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్‌లాగే ఉంటాడని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిని పార్టీ జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందన్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా ? జాతీయ నాయకత్వమా ? అని రాజాసింగ్ ప్రశ్నించారు.
గత అధ్యక్షుడు గ్రూపులు పెట్టాడు : రాజాసింగ్
‘‘గతంలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాడు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగింది. కొత్తగా వచ్చే బీజేపీ అధ్యక్షుడు కూడా గ్రూపులను పెట్టుకుంటే పార్టీకి లాభమేం ఉండదు. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు అయ్యే నేత.. సీఎంతో రహస్య భేటీలు నిర్వహించొద్దు. ఇది పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులోని మాట. నేను సాహసించి ఈవిషయాన్ని బయటపెడుతున్నాను. దీని గురించి గతంలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వినలేదు. అందుకే ప్రజల ముందు పెడుతున్నా’’ అని రాజాసింగ్(MLA Rajasingh) పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బీజేపీలోని మంచి నాయకుల చేతులను కట్టి పడేశారు. సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇస్తేనే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో అయినా సీనియర్ నేతలకు పార్టీ పెద్దలు అవకాశం కల్పించాలి’’ అని ఆయన కోరారు.
Also Read :Vangaveeti Radha: ఫ్యూచర్ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?
కేంద్ర మంత్రి పదవిని అమిత్ షా ఇచ్చారు : బండి సంజయ్
మరోవైపు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్‌గా ఉన్న కిషన్‌రెడ్డి, బీజేపీలో జాతీయ స్థాయి పదవిని ఇవ్వనున్నారట. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. తాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. ఆ పదవిని తాను కోరుకోవడం లేదన్నారు. ‘‘నాకు కేంద్ర మంత్రి పదవిని అమిత్ షా ఇచ్చారు. ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నాను. జాతీయ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తాను’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. దీంతో తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్న ఈటల రాజేందర్‌కు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు.