Ponnam Prabhakar: రవాణాశాఖలో కీలక మార్పులు: మంత్రి పొన్నం ప్రభాకర్
- By Kode Mohan Sai Published Date - 04:41 PM, Tue - 8 October 24

హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రవాణా శాఖలో కొన్ని ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మోటారు వాహన చట్టం కింద 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా, క్షేత్ర స్థాయిలో ఆర్టీవో మరియు డీటీవోలతో సమావేశాలను ఏర్పాటు చేసి, తెలంగాణ కూడా సారథి వాహన పోర్టల్‌లో చేరేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీవో 28 ద్వారా ఈ వ్యవస్థ అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మరియు దేశంలో వాహనాలకు సంబంధించిన 15 సంవత్సరాల పాత వాహనాలు మరియు 8 సంవత్సరాల ప్రైవేట్ వాహనాల కోసం స్క్రాపింగ్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు.
యునిసెఫ్ సహకారంతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలను అధ్యయనం చేసి, అక్కడి విధానాలను ఇక్కడ అమలు చేయడానికి జీవో తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. వాహనాల చెకింగ్‌కు సరైన విధానం అమలు జరగడం లేదని గుర్తించిన ఆయన, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్కో సెంటర్‌కు రూ. 8 కోట్లు ఖర్చు అవుతుందని, రాష్ట్రంలో మొత్తం 32 సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాల్లో యునిసెఫ్ సహకారం పొందుతున్నామని పేర్కొనడంతో పాటు, ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. వచ్చే నెలలో జరగబోయే రోడ్డు సేఫ్టీ మంత్ సందర్భంగా సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 8,000 లైసెన్సులు రద్దు చేసినట్లు వివరించారు.
“ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “ప్రాణాలు పోతాయన్న దృష్ట్యా, సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. వాహనాలు కొనుక్కున్నా, వారి పేరు మీద నమోదు చేసుకునే అవకాశం ఉండదు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి అవగాహన క్రియేట్ చేయడం చిన్న పిల్లల నుంచి మొదలుకొని అందరికి అవసరమైంది. ర్యాష్ డ్రైవింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.”
“కొత్తగా 113 మంది వెహికిల్ ఇన్స్పెక్టర్లు నియమితులయ్యారు. వారిని మరింతగా ఉపయోగించుకుంటాం. ఆర్టీసీలో ఎంవీఐ రూల్స్ అమలవుతున్నాయి. ఎక్కడా ఇబ్బంది లేదు. జీహెచ్‌ఎంసీలోని వాహనాలు కూడా రూల్స్ పాటించాల్సిందే. ప్రభుత్వ వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి రవాణా శాఖ విషయాలను అధికారులు చర్చిస్తారు. టీఎస్ నుంచి టీజీకి మారినప్పుడు, టీఎస్ వాహనాలు మళ్లీ టీజీగా మారుతాయో లేదో చెప్పలేదు. కొత్త వాహనాలు మాత్రం టీజీగా వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో వాహనాలు లైసెన్స్ రద్దు అవుతాయి, అప్పుడు వారు వాహనాలు కొనలేరు,” అని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పేర్కొన్నారు. “మా డిపార్ట్‌మెంట్ ద్వారా మాత్రమే కాకుండా, యునిసెఫ్ సహకారంతో కూడా అవగాహన కల్పిస్తున్నాం.”