Mini Medaram : నేటి నుంచి మినీ మేడారం.. భక్తులతో కళకళలాడుతున్న వనదేవతల పుణ్యక్షేత్రం
Mini Medaram : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనుంది.
- By Kavya Krishna Published Date - 09:49 AM, Wed - 12 February 25

మేడారం మహా జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరగడం ఆనవాయితీ. అయితే, క్రమక్రమంగా మినీ జాతరకూ భక్తుల తరలి రావడం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు మినీ జాతరకూ విశేష ప్రాముఖ్యత లభిస్తోంది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు మినీ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతరకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
బుధవారం మేడారం గ్రామంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాల్లో ఊరుకట్టు నిర్వహిస్తారు. ఆలయాలను శుద్ధి చేసి, ఆదివాసీ ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేస్తారు. సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, ఆదివాసీలు తమ వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యాలను వనదేవతలకు సమర్పిస్తారు. ఇదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయ పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకుని సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. భక్తులు మొక్కులు చెల్లిస్తారు.
Chicken Quality : బర్డ్ ఫ్లూ భయాలు.. చికెన్ కొనేటప్పుడు ఇవి చెక్ చేయండి
అదే విధంగా, కొండాయిలోని గోవిందరాజు ఆలయం, పూనుగొండలోని పగిడిద్దరాజు ఆలయంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు ఆదివాసీ ఆచార, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. నాయకపోడు పూజారులు ఘట్టమ్మ గుట్ట వద్ద సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తారు. అదే సమయంలో పొలిమేర దేవతలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఇప్పటికే మహా జాతరకు ఎంతటి జనసంద్రం ఉప్పొంగుతుందో, మినీ జాతరకూ అంతే స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర ఉత్సవానికి సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేశారు. మినీ జాతరకు ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మేడారం పరిసర ప్రాంతాలు ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి. వనదేవతల పుణ్యక్షేత్రం దివ్యమైన శోభను సంతరించుకుంది. సంప్రదాయాలకు అనుగుణంగా కొనసాగుతున్న ఈ మినీ జాతర, భక్తుల భక్తిశ్రద్ధలకు ప్రతీకగా నిలుస్తోంది.
ICC Bans Shohely Akhter: బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌కు ఊహించని షాక్.. ఐదేళ్లపాటు నిషేధం!