కాంగ్రెస్ వెలిగిపోతుంది.. మార్పు కోసం ఆ మూడు నినాదాలు..కేసీఆర్ పై ఖర్గే చార్జిషీట్
- By Hashtag U Published Date - 02:15 PM, Sat - 18 September 21

ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు…గజ్వేల్ సభ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్తదనం తెచ్చింది. మొబైల్ లైట్లను వెలిగించి కేసీఆర్ పాలనకు నిరసన తెలపాలని మల్లిఖార్జునఖార్గే పిలుపునివ్వడం సభ హైలెట్. సంయుక్తంగా ఖర్గే, రేవంత్ ఇచ్చిన పిలుపు క్షణాల్లో కొన్ని వేల మొబైల్ లైట్లు జిగేల్ మన్నాయి. వాటిని చూసిన తరువాత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం అవుతోంది. వెలిగిన ఆ లైట్ల కాంతిలో కేసీఆర్ ప్రభుత్వం కాలిపోయేలా స్పందన కనిపించింది. ఇదే తరహా సభలను 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా నిర్వహించారు. సీన్ కట్ చేస్తే..ఆయన తిరుగులేని ప్రధానిగా వెలిగిపోతున్నారు. ఇప్పుడు అదే పంథాను మల్లిఖార్జున ఖర్గే ఎంచుకున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి పాటించారు.
జై హింద్ , జై భీమ్, జై తెలంగాణ నినాదాలు సభలో కొత్తగా వినిపించాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ మూడు నినాదాలు ఈసారి చాలా బలంగా కాంగ్రెస్ నేతలు వినిపించారు. జై కాంగ్రెస్ కంటే ఆ మూడు నినాదాలను గజ్వేల్ సభలో కొత్తగా వినిపించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం లేకపోలేదు. హిందువులను ఏకం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోన్న విషయం అందిరికీ తెలిసిందే. పైగా దేశభక్తి కేవలం బీజేపీకి మాత్రమే సొంతం అన్నట్టు జై హింద్ నినాదాన్ని ప్రతి వేదిక మీద కమలనాథులు వినిపిస్తుంటారు. అదే, బీజేపీని రెండోసారి ఢిల్లీ గద్దెను చేజిక్కించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడింది. ఆ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ ఈసారిర జై హింద్ నినాదాన్ని అందుకుంది. ఆ నినాదం కేవలం బీజేసీ పేటెంట్ కాదని చెప్పే ప్రయత్నం ఖర్గే చేయడం గమనార్హం.
ఇక జై భీమ్ నినాదం చాలా బలంగా బీఎస్పీ వినిపిస్తుంటుంది. ఆ నినాదాన్ని తెలంగాణ వ్యాప్తంగా బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల మధ్యకు తీసుకెళుతున్నారు. దళిత, గిరిజనులను ఆకట్టుకునే స్లోగన్ గా దాన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పైగా ఆ నినాదం ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా స్వైరోల రూపంలో క్షేత్రస్థాయికి వెళ్లింది. అణగారిన వర్గాలు బీఎస్పీ వైపు మొగ్గుచూపకుండా తమవైపు తిప్పుకునే ప్రయత్నం గజ్వేల్ వేదిక మీద కాంగ్రెస్ పెద్దలు చేయడం రాజకీయ వ్యూహమే.
I wholeheartedly thank shri @kharge ji for attending conclusive meeting of #DalitaGirijanaAtmagowravaDandora at CM’s constituency, Gajwel and also thank him for his motivating words.
By his presence @INCIndia has proven it’s concern towards People of Telangana.@RahulGandhi pic.twitter.com/ffghgh0kKO— Revanth Reddy (@revanth_anumula) September 17, 2021
బలమైన జై తెలంగాణ నినాదాన్ని టీఆర్ఎస్ పార్టీ చాలా వరకు ఓన్ చేసుకుంది. ఆ పార్టీ నుంచి ఆ స్లోగన్ ను లాగేసుకునే ప్రయత్నం ఈసారి మల్లిఖార్జున ఖర్గే చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఖర్గే తెలంగాణ నినాదం చేయడం రాజకీయ వ్యూహంలో పెద్ద భాగం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అయినప్పటికీ రాజకీయంగా ఎలాంటటి లాభాన్ని కాంగ్రెస్ పొందలేకపోయింది. పార్లమెంట్ తలుపులు మూసి వేసి చీకట్లో తెలుగు రాష్ట్రాన్ని నిట్టనిలువుగా కాంగ్రెస్ చీల్చింది. ఆ రోజున బిల్లు పాస్ కావడానికి అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి చీకట్లో తతంగాన్ని ముగించారు. సోనియా గాంధీ అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి బిల్లును పెట్టారు. అందుకు బీజేపీ కూడా సహకారం అందించింది. మొత్తంగా ఆ రోజున తెలంగాణ రావడానికి ప్రధాన కారణం సోనియాగాంధీ అనే విషయాన్ని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కూడా చెబుతారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తరువాత ఏ విధంగా సోనియాను కేసీఆర్ మోసం చేశాడో చెప్పే ప్రయత్నం ఖర్చే చేయడం కూడా గజ్వేల్ సభలోని ప్రధాన రాజకీయ ఎజెండా. అంతేకాదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయడంలో కేసీఆర్ చెందిన వైఫల్యంపై చార్జిషీట్ ను విడుదల చేయడం సభలోని రాజకీయ హైలెట్. ఇక, స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. మొత్తం మీద గజ్వేల్ సభ కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని, పంథాను మార్చేయబోతుందని స్పష్టం చేసింది.ఇక రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి రుజువు అయింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న సంకేతాన్ని బలంగా ఇవ్వగలిగారు. కోమటిరెడ్డి , ఉత్తమ్, జానా మినహా సభలో చాలా వరకు కాంగ్రెస్ పెద్దలు కనిపించారు. ఇదో పాజిటివ్ సంకేతం. గజ్వేల్ సభను రక్తి కట్టించిన రేవంత్ అభిమానులకు కనుచూపు మేరలోనే ముఖ్యమంత్రి పదవి కనిపిస్తోంది.
Tags

Related News

CM Revanth Reddy : LB స్టేడియం కు చేరుకున్న రేవంత్ రెడ్డి
ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ..LB స్టేడియం కు చేరుకున్నారు