హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
- Author : Vamsi Chowdary Korata
Date : 04-03-2026 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
Bachupally Fire Accident హైదరాబాద్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఓ దుకాణంలో మొదలైన మంటలు, క్షణాల్లోనే పక్కనున్న షాపులకు వేగంగా వ్యాపించాయి. దుకాణాల్లో కలప, ఫర్నిచర్, ఫోమ్ వంటి తేలికగా మండే పదార్థాలు అధికంగా ఉండటంతో అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీనికితోడు, కొన్ని దుకాణాల్లో నిల్వ ఉంచిన వంట గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. అక్కడ 25 వరకు ఫర్నీచర్ దుకాణాలు ఉండగా, ఒక్కో షాపులో లక్షల విలువైన కలప సామాగ్రి నిల్వ ఉంది. నిమిషాల వ్యవధిలో 18 షాపులకు మంటల వ్యాపించాయి. కొందరు వ్యాపారులు అందులోనే నివాసం ఉంటున్నారు. దీంతో అక్కడ నిల్వ ఉంచిన వంట గ్యాస్ సిలెండర్లు పేలుడు గురయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఆరుకు పైగా ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు రాత్రంతా శ్రమించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.