Liquor Sales Record : తెలంగాణ సర్కార్ కు ‘కిక్’ ఇచ్చిన న్యూ ఇయర్
Liquor Sales : ఇక పండగల సీజన్లు , న్యూ ఇయర్ సందర్భాల్లో అయితే ట్రిపుల్ అమ్మకాలు సాగుతాయి.
- By Sudheer Published Date - 12:33 PM, Thu - 2 January 25

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మద్యం అమ్మకాల (Liquor Sales) గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చిన మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దీని బట్టి చెప్పొచ్చు రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఏ రేంజ్ లో సాగుతుందో. మాములు రోజుల్లోనే భారీగా మద్యం అమ్మకాలు కొనసాగుతాయి. ఇక పండగల సీజన్లు , న్యూ ఇయర్ (New Year) సందర్భాల్లో అయితే ట్రిపుల్ అమ్మకాలు సాగుతాయి. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ సందర్బంగా కూడా అలాగే సాగినట్లు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. డిసెంబర్ 28 నుంచి 31 వరకు ప్రజలు మద్యం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. ఎక్సైజ్ శాఖ వివరాల ప్రకారం.. ఈ నాలుగు రోజుల్లో రూ.926 కోట్ల విలువైన మద్యం అమ్ముడై ప్రభుత్వం ఖజానా నింపింది. ప్రత్యేకంగా డిసెంబర్ 31న నిర్వహించిన వేడుకలు భారీ ఆదాయానికి దోహదం చేశాయి.
డిసెంబర్ 28వ తేదీన రూ.191 కోట్లు, 29న రూ.51 కోట్లు, 30న రూ.402 కోట్లు, 31న రూ.282 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మొత్తం మొత్తాన్ని పరిశీలిస్తే డిసెంబర్ నెల మొత్తం తెలంగాణ ఖజానాకు పండుగగానే మారింది. గత ఏడాది చివరి నెలలో మొత్తం రూ.4 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని చెబుతున్నారు. డిసెంబర్ 31 న జరిగిన ఈవెంట్ల ద్వారా కూడా ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని రాబట్టింది. మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చి రూ.56.46 లక్షల ఆదాయం వసూలు చేశారు. వీటిలో ప్రధానంగా హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈవెంట్లతో వచ్చే ఆదాయం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు అత్యధిక స్థాయిలో నిలిచాయి. ఈ రెండు జిల్లాల్లో రూ.116 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. 93,725 లిక్కర్ కేసులు, 1,18,447 బీర్ కేసులు అమ్ముడైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే విక్రయాల్లో కొంత తగ్గుదల కనిపించింది.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డు అమ్మకాలు జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 31న ఒక్క రోజే రూ.200 కోట్ల విలువైన మద్యం విక్రయమైంది. మొత్తం రెండు రోజులలో రూ.331.85 కోట్ల మద్యం డిపోల నుంచి బయటికి వెళ్లినట్లు సమాచారం.