KTR : లాయర్‌తో కలిసి ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..!
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, సదరు లాయర్ ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో కూర్చుంటారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్లడానికి హైకోర్టు అనుమతించలేదు.
- By Latha Suma Published Date - 10:22 AM, Thu - 9 January 25

KTR : ఈరోజు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకాబోతున్నారు. ఫార్ములా ఈ రేసులో నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగాల నేపథ్యంలో విచారణకు హజరు కావాలని కేటీఆర్‌కి ఏసీబీ అధికారులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, సదరు లాయర్ ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో కూర్చుంటారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్లడానికి హైకోర్టు అనుమతించలేదు.
ఇక, మరికొద్ది సేపట్లో బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద సందడి నెలకొంది. కేటీఆర్ నివాసానికి ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు చేరుకున్నారు. న్యాయవాది రామచంద్రరావుతో పాటు లీగల్ టీమ్ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు.
కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో… ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీశ్ రావు ను పోలీసులు బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఒకవేళ కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.
Read Also: Tirupati Stampede : తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు