Formula-E race case : ముగిసిన కేటీఆర్ విచారణ..
ఏసీబీ మాదిరిగానే ఈడీ కూడా అవే ప్రశ్నలు అడిగారని వివరించారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని వారికి చెప్పానని కేటీఆర్ వివరించారు.
- By Latha Suma Published Date - 07:06 PM, Thu - 16 January 25

Formula-E race case : ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్‌ని ప్రశ్నించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకోగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులతో కూడిన బృందం ఫార్ములా – ఈ రేస్ కేసులో హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు నగదు బదిలీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ పై ప్రశ్నించింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో కేటీఆర్ విచారణ ముగిసింది. కేటీఆర్ కు వేసిన ప్రశ్నలు, ఆయన చెప్పిన సమాధానాలను స్టేట్‌మెంట్ రూపంలో రికార్డు చేసి కేటీఆర్ సంతకం తీసుకొని ఈడీ అధికారులు బయటకు పంపినట్లు తెలుస్తుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదున్నర గంటల పాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. ఆర్‌బీఐ అనుమతి తీసుకొనే నగదు బదిలీ చేశారా? నిబంధనల మేరకు నగదు బదిలీ చేశారా? బిజినెస్ రూల్స్ ఫాలో అయ్యారా లాంటి పలు ప్రశ్నలను ఈడీ అధికారులు కేటీఆర్ ను అడిగినట్టు తెలిసింది. ఈ-రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్స్‌కు నగదు బదిలీ చేయడంలో ఫెమా, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోణంలో కేటీఆర్ నుంచి అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ఆయణ్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు.
ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ మాదిరిగానే ఈడీ కూడా అవే ప్రశ్నలు అడిగారని వివరించారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని వారికి చెప్పానని కేటీఆర్ వివరించారు. ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చినట్లు తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి చేయకున్నా విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు. జడ్జి ముందు లైవ్‌లో విచారణకు సిద్ధం. జనం చూస్తుండగా టీవీ లైవ్‌లో విచారణకు సిద్ధం. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం రేవంత్‌రెడ్డి సిద్ధమా?. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉంది న్యాయమే గెలుస్తుంది. తప్పు చేయలేదు తప్పు చేయబోను. తప్పు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పా’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తనపై ఏసీబీ కేసు ఉందని రేవంత్‌రెడ్డి నాపై కూడా పెట్టించారు. తనపై ఈడీ కేసు ఉందని రేవంత్‌రెడ్డి నాపై కూడా పెట్టించారు.. అని కేటీఆర్ అన్నారు.
Read Also: India Batting Coach: టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్.. ఎవరంటే?