CBN : తెలంగాణ లో కేసీఆర్ ఉన్నాడనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నాడు – కేటీఆర్
CBN : తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడన్న సత్యాన్ని చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. కేంద్రంలో తానే ప్రభావవంతుడిని, రేవంత్ తన శిష్యుడేనని భావిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
- By Sudheer Published Date - 08:35 PM, Sat - 26 July 25

హైదరాబాద్ మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర స్థాయి సదస్సు (BRSV State Level Conference) జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడన్న సత్యాన్ని చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. కేంద్రంలో తానే ప్రభావవంతుడిని, రేవంత్ తన శిష్యుడేనని భావిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచిన తర్వాత, అతని ఇంటికి వెళ్లి భార్యను బెదిరించారని విమర్శించారు. ఫోన్ ఇవ్వలేదనే కారణంతో ఆమెపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని, ఇది ఎంతవరకు న్యాయమైనదో ప్రశ్నించారు. నల్లబాలు అనే వ్యక్తి సాధారణ రీట్వీట్ చేశాడని 20 రోజులు జైలు వేయడం సరికాదని, ఇది “మోహబ్బత్ కా దుఖాన్” అంటూ చెప్పే రాహుల్ గాంధీకి తగిన ప్రశ్నగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక, మిత్తీతో సహా సమాధానం చెబుతామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న వారు శాశ్వతమని భ్రమపడకూడదని అన్నారు. మూసీ ప్రాజెక్టులో జరుగుతున్న లక్షన్నర కోట్ల స్కాం ను బహిర్గతం చేయగానే సీఎం రేవంత్ రెడ్డి గందరగోళానికి లోనయ్యారని తెలిపారు. అలాగే లగచర్లలో గిరిజనుల భూములను రేవంత్ అల్లుడి కంపెనీ కోసం దండగ వేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కుట్రలకు బీఆర్ఎస్ అడ్డుగానే నిలిచిందని చెప్పారు.
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు రెండు రోజుల కలెక్షన్స్ ఇదే!
ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థుల పోరాటానికి ప్రస్తావన తీసుకువచ్చారు. గచ్చిబౌలి భూముల కోసం విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. లీగల్ సెల్ విద్యార్థులకు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తుందని, న్యాయపరమైన అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై పోరాడినవారికే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. గత పదేళ్లు నిశ్శబ్దంగా ఉన్న గొంతులు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు మీడియా మద్దతు లేకపోయినా, సోషల్ మీడియానే తమ ప్రధాన అస్త్రమని పేర్కొన్నారు.