Ghar Wapsi: కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. నష్టం బీజేపీకా.. బీఆర్ఎస్ కా?
ఎన్నాళ్లో వేచిన చేరిక, ఈనాడే నిజమైందని కాంగ్రెస్ వారు పాడుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లినా, ఇప్పుడు బిజెపి నుంచి కాంగ్రెస్ కు వచ్చినా తన ఏకైక లక్ష్యం అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే. తాను తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్
- By Praveen Aluthuru Published Date - 08:00 PM, Wed - 25 October 23

డా. ప్రసాదమూర్తి
Ghar Wapsi: ఎన్నాళ్లో వేచిన చేరిక, ఈనాడే నిజమైందని కాంగ్రెస్ వారు పాడుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లినా, ఇప్పుడు బిజెపి నుంచి కాంగ్రెస్ కు వచ్చినా తన ఏకైక లక్ష్యం అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే. తాను తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకి ఉందని కాంగ్రెస్ పార్టీకి లేదని ఆనాడు నమ్మి బీజేపీలో చేరానని, కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారై, బిజెపి పూర్తిగా రాష్ట్రంలో వైభవం కోల్పోయిన ఈ స్థితిలో తనకు మరో దిక్కు లేక మళ్ళీ కాంగ్రెస్ వైపు చూడాల్సి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఆయన పార్టీ మారారు గాని, తన లక్ష్యం మారలేదని చెప్తున్నట్టే అర్థం చేసుకోవాలి. తాను కాంగ్రెస్ ను వీడినప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలమైన స్థితికి ఎదుగుతుందని ఊహించలేదని, ఇప్పుడు ఎదిగిందని ఆయన భావించుకున్నట్టు అందరూ అనుకోవాలి. కారణాలు ఏమైనా బిజెపి తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో రాను రాను మరింత అథమస్థితికి వెళుతున్నట్టుగా ఈ పరిణామాలు చెప్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఈటల రాజేందర్ తోపాటు పలువురు బలమైన నాయకులు బిజెపిని వదిలిపెట్టి బయటికి వస్తారని ఎప్పటినుంచో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు బిజెపిలో అధిష్టానం ఈ నాయకులను బుజ్జగిస్తూ వచ్చింది. ఆ ప్రయత్నాల్లో ఈటల రాజేందర్ కొంత సంతృప్తి చెందినట్టు కనిపిస్తోంది. కానీ కోమటిరెడ్డి మాత్రం పార్టీని వదిలి బయటకు వచ్చేసారు. బహుశా ఆయన కోరికలు ఏం తీరలేదో మనకు తెలియదు. ఆయన పైకి చెప్పే కోరిక మాత్రం ఒకటే, బీఆర్ఎస్ ను ఓడించడమే.
ఏ పార్టీకి ఎంత నష్టం:?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరడం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభమే. ఆ మేరకు బిజెపికి నష్టమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ముఖ్యమైనది ఒకటి ఉంది. బిజెపి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే గణనీయమైన విజయాలు సాధించలేదు అనే విషయం స్పష్టమైంది. పోతే మిగిలిన లక్ష్యం కాంగ్రెస్ ని విజయం వైపు దూసుకు వెళ్లకుండా అడ్డుకోవడం. ఆ పని బిజెపి చేస్తుందని సర్వేలో తేలుతున్న ఓట్ షేరింగ్ విషయాల ద్వారా అర్థమవుతుంది. కానీ బలమైన నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలు క్రమంగా పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే ఆ మేరకు పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అధికారం ఎలాగూ సాధించలేని పార్టీకి నష్టం ఎంత మేరకు ఉన్నా అది లెక్కలోనిది కాదు కానీ, బిజెపి గెలవలేని స్థానాల్లో కూడా ఓట్ల శాతం ఎక్కువగా తెచ్చుకుంటే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించవచ్చు. అలా జరగాలంటే పార్టీలో బలమైన నాయకులు ఉండాలి. వారు బరిలోకి దిగాలి. వారికి వ్యక్తిగతమైన బలంతో కొంత ఓటింగ్ తెచ్చుకోవాలి. బలమైన నాయకులు క్రమంగా దూరమైపోతే అది పార్టీకి గణనీయమైన సంఖ్యలో ఓటర్లు దూరమవుతున్నట్టుగానే భావించాలి.
కాంగ్రెస్ ను దెబ్బతీసే స్థాయిలో బిజెపి లేకపోతే కచ్చితంగా అది కాంగ్రెస్కు లాభం, బీఆర్ఎస్ కు నష్టమని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అధిక సంఖ్యలో చీల్చగలిగితే, తద్వారా మరో ప్రతిపక్షమైన కాంగ్రెస్ కి నష్టం వాటిల్లుతుంది. అధికార బీఆర్ఎస్ కు లాభం కలుగుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే విషయంలో కూడా బిజెపి ఘోరంగా వెనకబడితే ఆ దెబ్బ బీఆర్ఎస్ మీద పడుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయినా అది సంపాదించుకునే ఓట్ల శాతం మీద బీఆర్ఎస్ విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రాముఖ్యత గల నాయకులు పార్టీని వదిలి బయటకు వెళ్తే పార్టీ పరపతి రాష్ట్రవ్యాప్తంగా పడిపోయే అవకాశం ఉంది. ఓటర్లలో బిజెపి ఎలాగూ గెలవదు, ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించాలంటే ఓటు కాంగ్రెస్ కే వేస్తే పోలేదా అని ఓటర్ మహాశయుడు ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ లాంటి బలమైన నాయకుడిని అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన అపకీర్తి మూటగట్టుకొని పార్టీ ఎంతో నష్టపోయింది. ఇప్పుడు రెండో స్థానంలోనో మూడో స్థానంలోనో ఉన్నా, ఓట్లు శాతం లో ఏ స్థానంలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. అందుకే కోమటిరెడ్డి లాంటి నాయకులు బిజెపిని వదిలితే ఆ నష్టం బిజెపి కంటే బీఆర్ఎస్ కే అధికం.
Also Read: BRS War Room: బీఆర్ఎస్ వార్ రూమ్స్ లో అసలేం జరుగుతోంది?