CM Revanth : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం ..ఇదేమైనా పాకిస్థాన్ అనుకుంటున్నావా..?
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ... బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 03:02 PM, Sat - 9 November 24

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న తన పుట్టినరోజు (Revanth Reddy Birthday) సందర్బంగా మూసీ నది పరివాహక ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..బిజెపి , బిఆర్ఎస్ నేతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది జస్ట్ ట్రైలర్..అసలు సినిమా చూపిస్తాం అంటూ హెచ్చరించారు.
ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయని, ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటానని రేవంత్ హెచ్చరించారు. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా… మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తానని సవాల్ చేశారు.
సీఎం వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని … బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన యాదాద్రి(Yadadri) జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పోచంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల(Rice buying centres)ను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అక్కడ స్థానిక అధికారులు ఎవరూ లేకపోవడంతో ఆయన సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి వస్తే ఎవరు రాకపోవడంపై మండిపడ్డారు. రైతులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress party).. రైతులను అన్ని విధాలా మోసం చేసిందని అన్నారు.
రాష్ట్రంతో 17 లక్షల మందికే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులను వదిలేశారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఆ డబ్బు ఎప్పుడు ఎలా వస్తుందో వారికే తెలియదని, రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేదని.. రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదని విమర్శించారు.
Read Also : Jharkhand : రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం బీజేపీతోనే సాధ్యం: అమిత్ షా