KCR Speech : దద్దరిల్లిన బిఆర్ఎస్ సభ..కేసీఆర్ నుండి ఒక్కో మాట..ఒక్కో తూటా !!
KCR Speech : వరంగల్ మట్టికి వందనం చేస్తూ, అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పించారు
- By Sudheer Published Date - 07:50 PM, Sun - 27 April 25

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం నడిపిన బిఆర్ఎస్ (BRS) ఉద్యమం 25 ఏళ్ల రజతోత్సవ ఘట్టాన్ని వరంగల్ ఎల్కతుర్తి వేదికగా ఘనంగా జరుపుకుంది. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి పునరుజ్జీవం తీసుకొచ్చింది గులాబీ జెండానే అని గుర్తుచేశారు. కులం, మతం, పదవుల కోసం కాకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే టీఆర్ఎస్ (ఇప్పటి బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. పదవీ త్యాగాల ద్వారా ప్రారంభమైన ఈ ఉద్యమం, ప్రజల విశ్వాసంతో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు.
Deadline : భారత్ ను వీడుతున్న పాకిస్థానీయులు
తెలంగాణ ప్రజలు ఎన్నో దశాబ్దాల పాటు ఎదుర్కొన్న బాధలు, హింస, నీటి కోసం చేసిన పోరాటాలను భావోద్వేగంతో వివరించారు. గోదావరి, కృష్ణా నదుల నీళ్ళు దక్కకపోయిన బాధను గుర్తు చేశారు. మట్టిలో కలిసిన ఆశలు, వలసల బాధలు, జీవిత పోరాటాలపై స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం ప్రారంభంలో ఎదురైన అవమానాలు, ఎగతాళిని గుర్తుచేస్తూ, వందలాది మంది త్యాగాలు, ఉద్యమాలతో తెలంగాణ ఉద్యమం ఎలా ఉప్పొంగిందో వివరించారు. ఈ క్రమంలో స్వయంగా తన నడిపించిన సిద్ధిపేట ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో ప్రజల సహకారం ఎలా ఉద్యమానికి ఊపిరి నింపిందో చెప్పారు.
ప్రజలు దీవించిన ఫలితంగా, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలబెట్టిన ఘనత బిఆర్ఎస్‌దేనని కేసీఆర్ గర్వంగా ప్రకటించారు. తెలంగాణ గడ్డకు ఉన్న ప్రత్యేకతను వర్ణిస్తూ, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్కల వీరత్వాన్ని, బమ్మెర పోతన కవితా వైభవాన్ని కొనియాడారు. వరంగల్ మట్టికి వందనం చేస్తూ, అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడమే తన లక్ష్యమని, ఇంకా కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ తెలంగాణను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తామని ధైర్యంగా ప్రకటించారు. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్ పట్ల నిబద్ధతను చెప్పుకొచ్చారు.