SLBC Tunnel Collapse : ‘SLBC టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే కారణం’ – సీఎం రేవంత్ రెడ్డి
SLBC Tunnel Collapse : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ విషాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీరియస్ ఆరోపణలు చేశారు.
- By Sudheer Published Date - 08:15 PM, Mon - 3 November 25
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ విషాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీరియస్ ఆరోపణలు చేశారు. గత ఫిబ్రవరి 22న జరిగిన టన్నెల్ కూలిపోవడంలో పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలంటూ ఆయన స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద SLBC ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ప్రారంభించి, భూగర్భంలో నీటి ప్రవాహాలు, రాతి పొరల బలహీనతలను గుర్తించడానికి NGRI ఆధ్వర్యంలో హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే ప్రారంభించామని వెల్లడించారు. ఈ సాంకేతిక సర్వే 1000 మీటర్ల లోతు వరకు భూభాగ పరిశీలనకు దోహదపడుతుందని సీఎం తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేసిందని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌లు రాకపోవడంతో పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. “SLBC టన్నెల్ కూలిపోవడం కేసీఆర్ చేసిన పాపం ఫలితం. 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నిర్లక్ష్యం బీఆర్‌ఎస్ పాలనలో ఎంత దారుణంగా ఉందో ప్రజలు చూశారు” అని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులకు అవకాశం లభించిందని, తెలంగాణ వాటా నీరు వృథా అయ్యిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు 1983లో ప్రారంభమైనప్పటికీ, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సగం కూడా ముందుకు సాగలేదని విమర్శించారు.
PhonePe : ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్
“ఇకపై SLBC పనులు ఏ అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తాం. ఆలస్యం వల్ల రూ. 2 వేల కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు రూ. 4,600 కోట్లకు పెరిగింది. కానీ, ఇది తెలంగాణకు ప్రాణాధారం కాబట్టి కచ్చితంగా పూర్తి చేస్తాం” అని నిశ్చయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 44 కి.మీ. టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీటిని 4 లక్షల ఎకరాలకు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. 4 వేల క్యూసెక్కుల నీటిని గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల రాజకీయ కుట్రలను పక్కనబెట్టి, కేంద్ర సహాయంతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో SLBC ప్రాజెక్టు దేశంలోనే సమర్థవంతమైన నీటి పారుదల ప్రాజెక్టుగా నిలుస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.