KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా
KCR : హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు
- By Sudheer Published Date - 05:14 PM, Sun - 2 November 25
హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో నగరం వేగంగా అభివృద్ధి చెందిందని, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా ప్రారంభం కాలేదని విమర్శించారు.
Liquor Tenders in Telangana : మద్యం దుకాణం దక్కించుకున్న ప్రభుత్వ టీచర్..కాకపోతే !!
కేటీఆర్ మాట్లాడుతూ, హైడ్రా అధికారులు పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టి పేదవారి ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, అరికపూడి గాంధీ, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ మంత్రి వివేక్ ఇళ్లన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ వాటిని కూల్చే ధైర్యం హైడ్రాకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. “పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఎందుకు?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితో అధికారులు కొందరి భూములకు పెన్సింగ్ వేస్తున్నారని, పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.
రాహుల్ గాంధీని కూడా కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజకీయాలను వ్యతిరేకించిన రాహుల్, తెలంగాణలో పేదల ఇళ్లు కూల్చుతున్న హైడ్రా చర్యలపై మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూల్చివేతలు తప్పని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిని ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన నిలదీశారు. 500 రోజుల్లోనే తెలంగాణలో బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతల బాధను ప్రజలకు తెలియజేయడానికే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు.