KCR Hospitalised : అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్
KCR Hospitalised : ఆయనకు తీవ్రమైన సీజనల్ జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం వైద్యులను సంప్రదించి వెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రిలోని ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యంపై సమగ్ర పరీక్షలు నిర్వహిస్తోంది
- By Sudheer Published Date - 07:34 PM, Thu - 3 July 25

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన సీజనల్ జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం వైద్యులను సంప్రదించి వెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రిలోని ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యంపై సమగ్ర పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషుల్లో ఆందోళన నెలకొంది.
Veera Mallu Trailer : థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే ..వీరమల్లు ట్రైలర్ పై చిరు ట్వీట్
కేసీఆర్‌తో పాటు ఆసుపత్రికి ఆయన భార్య శోభా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలోనూ కేసీఆర్ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ మధ్య తుంటి గాయానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా అనారోగ్యం బారిన పడుతుండడం తో అందరిలో ఆందోళన పెరుగుతుంది.
తాజాగా వచ్చిన ఆరోగ్య సమస్యలు వాతావరణ మార్పుల వల్లే అని వైద్యులు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు త్వరలో అధికారిక హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. ఈ వార్త తెలియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.