KCR Tour : కేసీఆర్ “ముందస్తు” టూర్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగియగానే గులాబీ బాస్ కేసీఆర్ జిల్లాల పర్యటనకి వెళ్లనున్నారు.
- By Siddartha Kallepelly Published Date - 10:52 AM, Mon - 13 December 21

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగియగానే గులాబీ బాస్ కేసీఆర్ జిల్లాల పర్యటనకి వెళ్లనున్నారు. హుజురాబాద్ బై పోల్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పిన సీఎం కోడ్ కారణంగా షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎమ్మెల్యే కోట , స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో జిల్లాల పర్యటనకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనల్లో భాగంగా జిల్లాల్లో నెలకొన్న సమస్యలు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల పనితీరుపై సంబంధిత వ్యక్తులను ఆరా తీయనున్నారు.
వాస్తవానికి గత నెల 10న సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన ఉండాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటన రద్దయింది. తరువాత ఎన్నికల హడావిడి ఉండటం అదే సమయంలో వరి కొనుగోలు పై సందిగ్ధం నెలకొనడంతో సీఎం కేంద్ర ప్రభుత్వంపై దూకుడు పెంచారు. వరుసగా మంత్రులు, సీఎం దాదాపు ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చారు. అనంతరం ధరణి, పొడు భూములు, మెట్రో, ఆరోగ్యశాఖలో బకాయిలపై అధికారులు వరుస సమావేశాల్లో నిమగ్నమయ్యారు. దింతో సీఎం జిల్లాల పర్యటన ఇన్ని రోజులు వాయిదా పడింది.రెండు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ పూర్తి అవ్వగానే ఎన్నికల కోడ్ ముగియనుంది. కోడ్ ముగియగానే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కి వెళ్లనున్నారు. ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడ్డ వరంగల్ పర్యటనతోనే జిల్లాల పర్యటన మొదలుకానుందని సమాచారం.
గతంలో వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా ప్రజా ప్రతినిధులు చేసిన విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే వోవర్ బ్రిడ్జిల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై సీఎం కేసీఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేయనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై, వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను కూడా కేసీఆర్ సమీక్షించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో రెడీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే కోట,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం రాని ఆశావహులను బుజ్జగించే కార్యక్రమం కూడా ఇదే పర్యటనలో ఉంటుందని సమాచారం. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తూ వారికి హామీలవర్షం కురిపించనున్నారు, పార్టీ అంతర్గత సమస్యలు కూడా కేసీఆర్ ఈ పర్యటనలో చర్చించే అవకాశముంది.జిల్లాల పర్యటన నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులను సైతం సీఎం విజిట్ చేసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల రూపకల్పన పై సీఎం వివరాలు సేకరించనున్నారు.