2023 Elections: లోక్‌సభ బరిలో కేసీఆర్.. పోటీ అక్కడినుంచేనా..?
- By HashtagU Desk Published Date - 11:00 AM, Sat - 19 February 22

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కరీం నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. గతంలో రెండుసార్లు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కేసీఆర్ విజయం సాధించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌కు గట్టి పట్టున్న, తనకు బాగా కలిసొచ్చిన, కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని తన తదుపరి లక్ష్యంగా కేసీఆర్ ఎంపిక చేసుకుంటున్నట్లు రాజకీయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది
2004లో అప్పటి కేంద్ర మంత్రి సీనియర్ బీజేపీ నాయకుడైన చెన్నమనేని విద్యాసాగర్ రావుపై 1,31,138 ఓట్ల మెజారిటీతో గెలిచిన కేసీఆర్, ఆ తరువాత 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 201582 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2008లో తిరిగి ఎంపీ పదవికి రాజీనామా చేసి కరీంనగర్ నుంచే మళ్లీ పోటీ చేసిన కేసీఆర్ 15765 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు. అందుకే వరుసగా కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేనంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేస్తూ, దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో హీట్ పెంచుతున్నారు కేసీఆర్.
దీంతో ఢిల్లీ కేంద్రంగా తన వాయిస్‌ని బలంగా వినిపించాలంటే, టీఆర్ఎస్‌కు పట్టున్న కరీంనగర్ ఎంపీ స్థానంలల గెలవడమే కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత కరీంనగర్ నియోజకవర్గాన్ని సందర్శించడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతోంది. కరీంనగర్ పర్యటనలో భాగంగా అక్కడి ముఖ్యనేతలతో సమావేశం అయిన కవిత, ఆ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. అంతే కాకుండా ఆ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతిలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ చురుగ్గా వ్యవహరిస్తోంది కవిత. గతంలో కేసీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికల బరిలోకి దిగి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కేసీఆర్ గెలుపులో కవిత కీలకపాత్ర పోషించారు. దీంతో మరోసారి కేసీఆర్ గెలుపు కోసం కవిత తీవ్రంగా కృషి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేకుండా పోయింది. గత రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల్ని టీఆర్ఎస్ చిత్తు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా కేసీఆర్ అక్కడ బరిలోకి దిగితే, కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గంలో టీఆరెఎస్‌కు తిరుగే ఉండదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీనగర్ లేదా వేములవాడ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో కరీంనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద ఎత్తున వార్ జరగడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా కరీంనగర్‌లో ఉన్న 13 నియోజకవర్గాల్లో తమ ప్రభావం చూపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌తో పాటు, కీలక సమయంలో దెబ్బకొట్టిన ఈటల రాజేందర్‌ని 2023 ఎన్నికల్లో ఓడించి, ఒకేదెబ్బకు రెండు పిట్టలు అనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.