KTR Open Letter : ‘‘వాళ్లది రియల్ ఎస్టేట్ మనస్తత్వం’’.. కేటీఆర్ బహిరంగ లేఖ
734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం’’ అని లేఖలో కేటీఆర్(KTR Open Letter) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 03:29 PM, Sun - 6 April 25

KTR Open Letter : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలుపుదాం అంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘400 ఎకరాల్లో పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం’’ అని లేఖలో కేటీఆర్(KTR Open Letter) పేర్కొన్నారు.
Also Read :Bullet Bikes : డుగ్.. డుగ్.. ఫట్.. ఫట్.. బుల్లెట్ బైక్‌లపై కొరడా
విద్యార్థుల నిరసనకు సలాం
‘‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థుల నిరసనకు సలాం. వారు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు రాష్ట్ర ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. పర్యావరణాన్ని నాశనం చేసే ప్రణాళికలను అమలు చేస్తోంది. ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసానికి తెర లేపారు. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని “ఫోర్త్ సిటీ”కి తరలిస్తామని హెచ్చరించడం తప్పు.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుతామని బీఆర్ఎస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read :BJP Formation Day : బీజేపీ 45 వసంతాలు.. కమలదళం ఎలా ఏర్పాటైందో తెలుసా ?
రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది
‘‘సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. విద్యార్థులను నిందించబడం, వారి ఉద్దేశాలను తప్పుపట్టడం వంటివి చేస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలిస్తామంటూ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ పోరాటం నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అడవిని కాపాడకుండా ఎకో పార్క్ పేరుతో భూ ఆక్రమణకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇది కేవలం యూనివర్సిటీపై జరిగిన దాడి కాదు. ప్రజాస్వామిక విలువలు, పర్యావరణంపై జరుగుతున్న దాడి’’ అని లేఖలో కేటీఆర్ రాసుకొచ్చారు.