Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?
దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని 'కాగ్' హెచ్చరించింది.
- By SK Zakeer Published Date - 01:32 PM, Fri - 2 May 25

Kaleshwaram: సామాన్య ప్రజల్ని కట్టిపడేసే మాయను బిఆర్ఎస్ నాయకులు అభ్యసించినంతగా మరెవరూ అభ్యసించలేదు. ‘నకిలీ అద్భుతాన్ని చూపించి నిజ జీవితాన్ని మరిచిపోయేలా చేయడం.నీకు అవసరం లేని దానిని కావాలని అనిపించేలా చేయడం. నిజమైన జీవితం కాకుండా మాయా ప్రపంచంలో బతికేలా చేయడం’… ఒక మాయ.ఈ మిథ్య మనుషుల మనసును సులభంగా వశపరచుకుంటుంది. ”జనానికి గొప్పగా ఉండేవి అంటే చాలా ఇష్టం.అవి వాళ్ళను ఆశ్చర్య చకితులను చేసేంత అద్భుతంగా,విశ్వరూపంలో కనిపించాలి.మీరు చూపించే అద్భుతాలను చూసేందుకు జనం తండోప తండాలుగా వస్తారు.కళ్ళకు కనిపించేదే వాళ్ళ హృదయాలకు సూటిగా తగులుతుంది” అని 1469 – 1527 కు చెందిన రాజకీయ తత్వవేత్త మాకియవెలి అన్నాడు. మాకియవెలి సూత్రాన్ని కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు అక్షరాలా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోనే అద్భుతమైన మానవ నిర్మిత కట్టడంగా,ఇంజనీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) గురించి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు.తీరా అదంతా ‘డొల్ల’ అని తేలినపుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆత్మరక్షణలో పడుతుందని కొందరు అమాయకంగా భావించారు.
”కేంద్రప్రభుత్వ జేబు సంస్థగా ఎన్ డీఎస్ ఏ పనిచేస్తోంది.ఆ నివేదిక రాజకీయ ప్రేరేపితం” అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.కాగా ”ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీసులో తయారైన వంటకం” అని కేటీఆర్ కొన్ని రోజుల కిందటే అన్నారు.గతంలో ప్రగతిభవన్,ఇప్పుడు ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ లో రూపొందితే తప్ప ఏ రిపోర్టునూ బిఆర్ఎస్ నాయకులు అంగీకరించేలా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.తమ వైపున తప్పు ఉన్నా సరే,అవతల ప్రత్యర్థులపై ఎదురుదాడి ఎలా చేయాలో బిఆర్ఎస్ దగ్గర శిక్షణ తీసుకోవలసిందే.
”కాళేశ్వరం కూలిన పాపం ముమ్మాటికీ బి.ఆర్.ఎస్ పాలకులదే.ఇంజినీరింగ్ వైఫల్యానికి ఇదో పరాకాష్ట.బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన ప్రాజెక్టు వారి హయంలోనే కూలి పోయిందన్నారు. మెడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజిల నిర్మాణాలు పూర్తిగా కూలి పోయాయని ఎన్.డి.ఎస్.ఏ నివేదికలో స్పష్టం అయింది.కాళేశ్వరం పేరుతో బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన అప్పులు మూడు తరాలకు భారంగా పరిణమించగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది.నాటి ప్రభుత్వం భారీ వడ్డీలతో చేసిన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 16,000 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణా రైతాంగానికి మోయలేని భారంగా మారింది.ఎన్.డి.ఎస్.ఏ నివేదిక ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు.2019 నుండే నీళ్లు కారడం,పగుళ్లు ఏర్పడడం జరిగినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇంతటి విపత్తుకు బాద్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు.రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం”అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏప్రిల్ 29 న మీడియా సమావేశంలో చెప్పారు.
”కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు మాకు ఇవ్వలేదు. హడావుడిగా డిజైన్లు/డ్రాయింగ్‌లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీశ్‌రావు తొందరపెట్టారు. రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు,కాళేశ్వరం ఈఎన్‌సీ బి.హరిరాం నాపై ఒత్తిడి చేశారు. 3 డీ అధ్యయనం తర్వాత డి జైన్లు/డ్రాయింగ్‌లు రూపొందించాల్సి ఉండగా 2 డీ అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా ఏర్పడింది. ఉన్నతస్థాయిలో జరిగిన ఏ సమీక్షకూ నన్ను పిలవలేదు.ఇచ్చిన డిజైన్లు/డ్రాయింగ్‌ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేవా? పరిశీలించాల్సిన బాధ్యత నాపై ఉన్నా గత ప్రభుత్వం ఆ అవకాశమే ఇవ్వలేదు. నిర్మాణం చేపట్టడానికి ముందు బ్యారేజీలు కట్టే ప్రదేశాన్ని పరిశీలించి,ఎంత పొడవుతో కడుతున్నారనే వివరాలు తెలుసుకోవడం తప్ప మిగతా అంశాలను పరిశీలించలేదు.నాటి ముఖ్యమంత్రే డిజైన్లను ఖరారు చేశారు.మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు/డ్రాయింగ్‌లను సీడీవోతో కలిసి ఎల్ అండ్ టీ తయారు చేసింది. బ్యారేజీలు 2019 జూన్‌లో ప్రారంభం కాగా… వాటిని నాలుగేళ్లపాటు పట్టించుకోలేదు. నాలుగేళ్ల పాటు బ్యారేజీలను వదిలేయడం వల్లే వైఫల్యం చెందాయి”. అని జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ ఎదుట విచారణలో మాజీ ఈఎన్‌సీ,సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు.
అయితే కేసీఆర్ ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు.”కాళేశ్వరం ప్రాజెక్టును మేము డిజైన్ చేయలేదు.కాంగ్రెస్ నాయకుల మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట.నాకు ఇంజినీరింగ్ భాషే రాదు. రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప డిజైన్ చేసేవాళ్లం కాదు. సీఎం అయ్యాక తక్కువ ముంపుతో వరద నీటిని తీసుకొని వాడుకోవాలనేది వ్యూహం రచించా. దానికి మూడు బ్యారేజీలు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరును పూర్తి చేయాలి.ఒక బ్యారేజ్ నుంచి మరో బ్యారేజ్‌కి తీసుకుంటూ.. గోదావరిని సజీవం చేసుకుంటూ నీళ్లను గడ్డ మీదుకు తెచ్చుకోవాలి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు-అన్నపూర్ణ-రంగనాయకసాగర్-మల్లన్నసాగర్-కొండపోచమ్మ సాగర్. ఈ క్రమంలో ప్రతి స్టేజీలో లక్షల ఎకరాల్లో నీళ్లు వస్తయ్. మిడ్‌మానేరు ఎస్సారెస్పీ పాత ఆయకట్టుకు నీరిస్తది. అప్పర్ గోదావరి నుంచి బాబ్రీ తదితర అనేక చెక్‌డ్యామ్‌లు కట్టుకొని నీళ్లు తీసుకుంటుంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరుకు కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సరఫరా చేయాలని నిర్ణయించాం. ఎస్సారెస్పీ ఆయకట్టు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత పాత మెదక్ జిల్లా. సింగూరు నుంచి నిజాంసాగర్‌కు వెళ్లి నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటది. ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో ఆయకట్టు సేఫ్‌గా ఉంటుంది. అలా 40లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఢోకా లేదు’’ అని కేసీఆర్ 2024 ఏప్రిల్ లో ఒక న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ చెప్పారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ‘మానవ నిర్మిత విపత్తు’గా తేలిపోయింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ఇదొక ‘తెల్ల ఏనుగు’అని విమర్శలు వచ్చాయి.కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం,సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నట్లుగా ‘జాతీయ డ్యాముల భద్రతా సంస్థ’ రిపోర్టు ఇవ్వడం సంచంలనం.2014 కంటే ముందు నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం! కానీ కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీళ్లు,ప్రాజెక్టుల విషయంలో చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.”ప్రభుత్వ ఖజానాను కేసీఆర్ లూటీ చేశారు”అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 28 న మీడియాకు చెప్పారు.ఆయన చెబుతున్న ‘లూటీ’లో సింహభాగం కాళేశ్వరం ‘మింగినట్టు’ అనుమానాలు కలుగుతున్నవి.కాళేశ్వరం ఒక విఫల పథకంగా,బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ తప్పిదంగా రుజువవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు తెలంగాణకు శాపంగా మారాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు,రాష్ట్ర ప్రజలను కుంగుబాటుకు గురి చేసింది.ఆ ప్రాజెక్ట్ వైఫల్యం కేవలం కుంగుబాటు సంఘటనతోనే బయటపడలేదు.ఈ వైఫల్యం గురించి అప్పటి సీఎం కేసీఆర్ కు,అధికారులకు ముందే తెలుసని నిపుణులంటున్నారు.బీఆర్ఎస్ సర్కారు అసమర్థ ప్రణాళికల కారణంగా భారీగా ప్రజాధనం వృథా కావడంతో పాటు రాబోయే తరాలూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నా అభిప్రాయం వ్యక్తమవుతోంది.డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు,డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చేవెళ్ల – ప్రాణహిత ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. తెలంగాణలోని 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో 165 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాణహిత-ఎల్లంపల్లి-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలని తలపెట్టారు.తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీరు అందుబాటులో లేదని కేంద్ర జల సంఘం పేర్కొన్నట్టు 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది అసత్యమని ఆలస్యంగా తేలింది.కానీ అక్కడ 165 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్రజలసంఘం చెప్పినా ప్రాజెక్టును రీ-ఇంజనీరింగ్ చేసి లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చారు. ప్రాణహిత చేవెళ్లతో పోల్చితే కాళేశ్వరం నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ అని కూడా కేసీఆర్ కు తెలుసు.
2016లో కాళేశ్వరం డీపీఆర్ తయారీయే చాలా హడావుడిగా జరిగింది.సాధారణంగా బ్యారేజీల డిజైన్లు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై తుదినిర్ణయం తీసుకోవడానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) నోడల్ యూనిట్‌గా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సరైన డిజైన్లు రూపొందించడానికి సీడీవోకు తగినంత సమయం ఇవ్వలేదు. తగినంత సమయం ఇవ్వకుండా ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్ హడావుడిగా చేయడంతో ప్రాజెక్టుకు సరైన డిజైనింగ్ జరగలేదు.ప్రాజెక్టు కట్టే చోట జియోటెక్నికల్ పరిశోధనలు చేయడం, నాణ్యత, పర్మియబిలిటీని (రాళ్ల గుండా నీరు ప్రవహించే సామర్థ్యం) పరీక్షించడం, ఆ డేటాతో నిర్మాణాలను ప్లాన్ చేయడం.. వీటన్నింటికీ 8 నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. కానీ.. డీపీఆర్ తయారీకి 4నెలల సమయమే ఇచ్చారు. జియోటెక్నికల్ పరిశోధనకూ తగిన సమయం ఇవ్వలేదు. ప్లానింగ్, డిజైన్లపై ఇవి తీవ్రప్రభావం చూపాయి.డీపీఆర్ తయారీకి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైంది.
మూడు బ్యారేజీల నిర్మాణం తలపెట్టినచోట జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి డీపీఆర్‌లో పొందుపరిచారు. డీపీఆర్‌ను సమర్పించిన తర్వాత అన్నారం,సుందిళ్ల బ్యారేజీ స్థలాలను ప్రభుత్వం మార్చేసిందన్నా విమర్శలున్నవి. ఇంత పెద్ద ప్రాజెక్టు నాణ్యతను థర్డ్‌పార్టీతో ఆడిట్ చేయించలేదన్న విమర్శలూ ఉన్నాయి.మేడిగడ్డ బ్యారేజీలో 2019లో వర్షాకాలం ప్రారంభమైన వెంటనే కటాఫ్ వాల్ దిగువన ఉన్న సీసీ బ్లాకుల దిగువ ప్రాంతంలో నీరు బయటకు రావడం ప్రారంభమైనట్టు కనుగొన్నారు. అయినా రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని మరమ్మతుల కోసం ఖాళీ చేయకుండా అవసరాలకు వాడుకుంటూ వచ్చారు. మరమ్మతులు, కాలానుగుణ నిర్వహణ ప్రొటోకాల్ పూర్తిగా లేకపోవడంతో ఏటా క్రమంగా క్షీణించి, చివరికి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.
Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. వెలుగులోకి మరో కీలక విషయం!
ఎగువన ఉన్న అన్నారం,సుందిళ్ల బ్యారేజీలు కూడా మేడిగడ్డ లాగా ఒకే రకమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులను కలిగి ఉండడంతో అవి కూడా ప్రమాదంలో పడినట్లుగా ఎన్ డి ఎస్ ఏ తెలిపింది.కాళేశ్వరం ఆయకట్టు అంతా కనికట్టేనని ‘కాగ్’ నివేదిక నిగ్గు తేల్చింది.18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2022 మార్చి నాటికి కేవలం 40,888 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చినట్లు కాగ్ స్పష్టం చేసింది.దీనిని బట్టి పరిశీలిస్తే కాళేశ్వరంలో లక్ష కోట్ల నిధులు పారాయి కానీ లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని స్పష్టం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 180 టీఎంసీల నీటితో 18.26 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేశారు. 2016 మే 2వ తేదీన శంకుస్థాపన చేసి,2019 జూన్ 21వ తేదీన ప్రారంభించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ తెల్ల ఏనుగులా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.83 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు, మరో 4.71 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం.
కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టులో పండే పంటలకు ఎత్తిపోసే నీళ్లు, తాగునీరు, పరిశ్రమలకు అందించే నీటికి అయ్యే ఖర్చుతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపు కలిపి రూ.28,081.54 కోట్లుగా ఉంటే,వాటన్నింటి ద్వారా ఆదాయం మాత్రం రూ.14,709.84 కోట్లుగా ఉన్నదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.ఇందులో ఎత్తిపోతలకు అయ్యే విద్యుత్తు చార్జీలు రూ.10,374.56 కోట్లు,నిర్వహణ ఖర్చులు రూ.272.70 కోట్లు కలిపి రూ.10647.26 కోట్లు అవుతుందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.దాదాపు లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ.64.204.13 కోట్లు.వడ్డీలు సకాలంలో చెల్లించకుండా వాయిదా వేయడంతో అదనంగా మరో రూ.19,556.4 కోట్ల వడ్డీ అసలులో కలిసింది. దీంతో అసలు రూ.87,369.89 కోట్లు అయింది. దీనికి వాయిదాలుగా ప్రతి ఏటా వడ్డీ, అసలు కింద రూ.10 వేల కోట్ల నుంచి 14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని కాగ్ తెలిపింది.
దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ‘కాగ్’ హెచ్చరించింది.జరిగిన నష్టానికి తమకు సంబందం లేదని 2019 లోనే కాంట్రాక్టర్లు ప్రకటించిన విషయాన్ని’ కాగ్’ బట్టబయలు చేసింది.తమకు ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము పనులు చేశామని, అలాంటప్పుడు జరిగిన నష్టానికి తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నిస్తున్నారు.నిధులు ఇస్తే పనులు చేయడానికి గుత్తేదార్లు ముందుకు వచ్చారు దీంతో సాగునీటి శాఖనే ఈ పనులు చేపట్టడానికి రూ. 470.03 కోట్లతో అంచనాలు రూపొందించింది. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు చేపట్టలేదు.ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తరువాత నిర్వహణ లోపం కారణంగానే మేడిగడ్డ కుంగినట్లు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ తేల్చి చెప్పిందని కాగ్ తెలిపింది.2019-20లలో మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచీ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్‌లను,లాంచింగ్ అప్రాస్‌లను తనిఖీ చేయలేదని, నిర్వహించలేదని కమిటీ గుర్తించిందని కాగ్ తన నివేదికలో పొందుపర్చింది.బరాజ్‌ను పునరుద్ధరించే వరకు ఇది నిరుపయోగంగానే ఉంటుందని తెలిపింది.