Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!
ఏ ఇంటెలిజెన్స్ సర్వే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సూచించలేదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఈ తప్పుడు సర్వే ఫలితాల వార్తలను ప్రచారం చేస్తున్నారని వివరించింది.
- By Gopichand Published Date - 06:33 PM, Sun - 26 October 25
Congress: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ‘ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ’ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా రోజువారీగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ (Congress) తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీని దాని నాయకులను అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు, కల్పిత వార్తలను సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఖండించిన తప్పుడు వార్తలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. దివంగత మాగంటి గోపినాథ్ మరణాన్ని కోరుకున్నట్లు వచ్చిన ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా అవాస్తవమని, అభ్యర్థిని అప్రతిష్టపాలు చేసే కుట్ర అని పేర్కొంది. ప్రభుత్వంలో ముస్లింలు కీలక పదవులు నిర్వహించలేరని, అందువల్ల ఏ ముస్లింను మంత్రిగా చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారం జరుగుతోందని తెలిపింది.
Also Read: Walk In Pollution: వాకింగ్‌కి సరైన సమయం ఏది? ఉదయం పూట నడక సురక్షితమేనా?
ఏ ఇంటెలిజెన్స్ సర్వే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సూచించలేదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఈ తప్పుడు సర్వే ఫలితాల వార్తలను ప్రచారం చేస్తున్నారని వివరించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం చేస్తున్న ‘ఫేక్ న్యూస్ క్లిప్పింగ్’ పూర్తిగా కల్పితమైనది. తప్పుదారి పట్టించేలా, దురుద్దేశపూర్వకంగా రూపొందించినది అని కాంగ్రెస్ ఖండించింది.
ఈ తప్పుడు ప్రచారాలకు బీఆర్‌ఎస్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ కేంద్రంగా పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా ‘వెలుగు’ వంటి విశ్వసనీయ పత్రికల పేరుతో ఫేక్ న్యూస్ క్లిప్పింగ్‌లను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఓటర్లను, తెలంగాణ ప్రజలను ఇలాంటి తప్పుడు, కల్పిత వార్తలను నమ్మవద్దని, ఫేక్ ప్రచారం నుండి జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. ఉపఎన్నిక సందర్భంగా ప్రత్యర్థులు చేస్తున్న ఈ విష ప్రచారాన్ని ధైర్యంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.