Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
- By Pasha Published Date - 10:58 AM, Tue - 19 March 24

Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ ఆయనకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(Telangana Governor) బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998, 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలదించారు. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా ఆయన నియమితులయ్యాడు. తాజాగా ఆయనకు తెలంగాణకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సోమవారం అనుహ్యంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆమె రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. గతంలో బీజేపీలో పని చేసిన ఆమె.. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. చెన్నై సెంట్రల్ లేదా తుత్తూకూడి నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
తెలంగాణ గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేసే సందర్భంగా తమిళిసై సౌందర్ రాజన్ ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్ల పాటు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ రాజ్ భవన్‌లోనే బస చేశారు. ఈ సమయంలో రాజీనామా చేస్తాననే విషయాన్ని ప్రధానితో తమిళిసై పంచుకున్నారని సమాచారం. ఆయన అనుమతితో ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది. తమిళనాడుకు వెళ్లిన తమిళిసై అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో బిజీ కానున్నారు.