Janasena : తెలంగాణపై జనసేన అధినేత ఫోకస్.. 26 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌ల నియామకం
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు దూకుడుని పెంచాయి. ఇటు జనసేన కూడా తెలంగాణపై
- Author : Prasad
Date : 13-06-2023 - 8:14 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు దూకుడుని పెంచాయి. ఇటు జనసేన కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని ఆ పార్టీ నేతలను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు జనసేన కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ కోసం 1300 మంది అమరవీరులు ప్రాణాలర్పించారని, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటికీ వారి ఆశలు నెరవేరలేదన్నారు. ఏ పార్టీ కూడా ఇంత మంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ఇంచార్జ్‌లను కోరారు.
తెలంగాణలో తన ప్రత్యేక ప్రచార వాహనం ‘వారాహి’పై త్వరలో ప్రచారం చేపట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు తెలిపారు. తెలంగాణలో జేఎస్పీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని గత ఏడాది మేలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలోని 20 శాతం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని, అయితే సీట్ల సంఖ్య లేదా ఇతర పార్టీలతో పొత్తులపై పార్టీలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్-డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి.