Harassment By BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామా
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి (Boga Sravani) తన పదవికి రాజీనామా చేసి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను కలవవద్దని, కేటీఆర్ పేరు చెప్పవద్దని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి తెలిపారు.
- By Gopichand Published Date - 08:15 AM, Thu - 26 January 23

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి (Boga Sravani) తన పదవికి రాజీనామా చేసి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను కలవవద్దని, కేటీఆర్ పేరు చెప్పవద్దని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి తెలిపారు. ఎమ్మెల్యే వల్ల తనకు, తన కుటుంబానికి ప్రమాదం ఉందని, తన కుటుంబానికి ఏం జరిగినా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌దే బాధ్యత అని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఎస్పీ శ్రవణ్ ని కోరారు.
బీసీ మహిళ ఎదుగుదల చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ప్రతి తప్పుకు తననే బాధ్యురాలిని చేశారని శ్రావణి వాపోయింది. కౌన్సిలర్లను కూడా ఎమ్మెల్యే చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవద్దని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారని, ఎమ్మెల్యే పదవితో పోలిస్తే నీ పదవి ఎంత అని ఎమ్మెల్యే పలుమార్లు దూషించారని ఆమె కన్నీరుమున్నీరైంది. కష్టాల్లో ఉన్నా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగానని శ్రావణి అన్నారు.
Also Read: Bluetooth Helmet: మార్కెట్ లోకి సరికొత్త బ్లూటూత్ హెల్మెట్.. ధర ఫీచర్స్ ఇవే?
చెప్పకుండా ఒక వార్డును సందర్శించినా ఎమ్యెల్యే దృష్టిలో నేరమేనని చెప్పారు. తన చేతుల మీదుగా ఒక్క పని కూడా ప్రారంభం కాకుండా చేశారని అన్నారు. పేరుకే తాను మున్సిపల్ ఛైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే అని దుయ్యబట్టారు. ఆయన ఇచ్చిన స్క్రిప్టునే తాను చదవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, కవిత పేరును ప్రస్తావించకూడదు, వారిని కలవకూడదని హుకుం జారీ చేశారని చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నానని చెప్పారు.