Bhoodan Land Scam: భూదాన్ భూములతో ‘రియల్’ దందా.. పాతబస్తీలో ఈడీ రైడ్స్
పాతబస్తీలో ఉన్న మునావర్ ఖాన్(Bhoodan Land Scam), ఖదీరున్నిసా, శర్పాన్, షుకూర్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
- By Pasha Published Date - 11:48 AM, Mon - 28 April 25

Bhoodan Land Scam: తెలంగాణలో మరోసారి ఈడీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో పాతబస్తీలోని పలువురి ఇళ్లలో రైడ్స్ చేస్తున్నారు. భూదాన్ భూములను ఆక్రమించి లే అవుట్ చేసి అమ్మేసిన మునావర్ ఖాన్, ఖదీరున్నిసాలను ప్రశ్నిస్తున్నారు. దాదాపు వంద ఎకరాల భూమిని వారిద్దరు విక్రయించినట్టు గుర్తించారు. పాతబస్తీలో ఉన్న మునావర్ ఖాన్(Bhoodan Land Scam), ఖదీరున్నిసా, శర్పాన్, షుకూర్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. భూదాన్ భూముల అంశంపై తెలంగాణ హైకోర్టు గురువారం రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం చోటుచేసుకున్న మూడు రోజుల తర్వాత ఈడీ నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం.
Also Read :Ban On Pak : మరో డిజిటల్ స్ట్రైక్.. పాక్ యూట్యూబ్, స్పోర్ట్స్ ఛానళ్లపై బ్యాన్
నాగారం గ్రామంలోని భూదాన్ భూములపై..
ఇటీవలే భూదాన్ భూముల అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్నందున.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. తదుపరి ఆర్డర్స్ ఇచ్చే దాకా ఈ ల్యాండ్స్‌ను అన్యాక్రాంతం చేయరాదని తెలిపింది. ఆ భూములపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు మహేశ్వరం, ఎల్బీనగర్ సబ్‌రిజిస్ట్రార్లకు గురువారం రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీసీఎల్‌ఏతోపాటు సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read :Pak Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ ఏమయ్యాడు ? బంకర్‌లో దాక్కున్నాడా ?
పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు నోటీసులు
ప్రతివాదులైన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేయాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ కేసులో పెద్దాఫీసర్లు ఉండటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌ను అనుమతించొద్దని రిజిస్ట్రీకి హైకోర్టు ధర్మాసనం నిర్దేశించింది. నాగారంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం రోజు ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది.