Anti-Narcotics Day Event : తెలంగాణ గంజాయికి అడ్డా కావొద్దు – సీఎం రేవంత్
Anti-Narcotics Day Event : "తెలంగాణ గడ్డ గంజాయి, డ్రగ్స్‌కు అడ్డా కాకూడదు" అని హెచ్చరించారు. దేశంలో 140 కోట్ల మందిలో ఒక్కరు కూడా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది మనకు అవమానం అని అన్నారు
- By Sudheer Published Date - 07:04 PM, Thu - 26 June 25

డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని (Anti-Narcotics Day Event) పురస్కరించుకొని తెలంగాణలోని శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “తెలంగాణ గడ్డ గంజాయి, డ్రగ్స్‌కు అడ్డా కాకూడదు” అని హెచ్చరించారు. దేశంలో 140 కోట్ల మందిలో ఒక్కరు కూడా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది మనకు అవమానం అని అన్నారు. యువత డ్రగ్స్‌కు బానిసలవడాన్ని నిరోధించేందుకు తన పాలనలో ఉక్కుపాదం మోపుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయిని విక్రయించాలంటే ఇప్పుడు వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ కూడా ప్రసంగించారు. భారతదేశం యువత దేశమని, వారి భవిష్యత్తు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. డ్రగ్స్ ద్వారా యూత్‌ను లక్ష్యంగా చేసుకుని దేశాన్ని లోపలుండగానే నాశనం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. దేశం నంబర్ వన్‌గా ఉండాలంటే, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, యువత జాగ్రత్త పడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, సెలబ్రిటీలు అందరూ కలసి ఈ మత్తు పదార్థాల వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా గుంటూరులో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ పై తాము యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపారు. ముఠాకక్షలకూ ఇక సమాధి వేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణిచివేసిన ఘనత టీడీపీదేనని చెప్పడంతో పాటు, భవిష్యత్తులో నేరగాళ్లకు అవకాశం ఉండదని హెచ్చరించారు.