TSPSC New Team : టీఎస్‌పీఎస్‌సీ పోస్టులకు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అప్లికేషన్లు
TSPSC New Team : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) పాలకమండలి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఎంపికకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 09:46 AM, Sat - 20 January 24

TSPSC New Team : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) పాలకమండలి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఎంపికకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్‌సీలోని చైర్మన్, మెంబర్ల పోస్టులకు పోటీ మామూలుగా లేదు. ఇప్పటికే 900 మందికిపైగా అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారిలో ఏకంగా మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రొఫెసర్లు, పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారట. చాలామంది చైర్మన్‌తో పాటు, మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు. ఆయన పర్యటనను ముగించుకొని తెలంగాణకు వచ్చాక దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఈ పోస్టులకు పోటీ పెరిగింది. JNTU, HCU, OU, కాకతీయ యూనివర్సిటీలతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. ఇలా ఎవరి లక్‌ను వాళ్లు పరీక్షించుకుంటుండగా.. సీఎం రేవంత్ మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలపై ఫుల్ క్లారిటీతో ఉన్నారట. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఉండాలంటే చైర్మన్‌గా ఓ రిటైర్డ్ ఐపీఎస్‌ను, మెంబర్లుగా ప్రొఫెసర్లను నియమించాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారని అంటున్నారు. చివరి నిమిషంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్(TSPSC New Team) పోస్టు కోసం ఎవరి పేరును సీఎం రేవంత్ తెరపైకి తెస్తారో వేచిచూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
10 మంది సభ్యులతో పాలకమండలి
చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులతో టీఎస్‌పీఎస్‌సీ పాలకమండలి ఉంటుంది. వీరిలో సగం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి ఉండాలన్నది నిబంధన. దీంతో ఇప్పుడు బోర్డు ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఛైర్మన్‌గా ICS, రిటైర్డ్ IPS, పలువురు ప్రొఫెసర్స్ పేరును పరిశీలిస్తోంది. చైర్మన్‌గా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న IPS అధికారిని ఎంపిక చేస్తే నిరుద్యోగుల్లో నమ్మకం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా ఉంది. దీంతో మొన్నటిదాకా కమిషనర్‌గా పనిచేసిన IPS అధికారి పేరును సీఎం పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ అధికారికి ఇంకా ఐదేళ్ల సర్వీస్ ఉండటంతో దాన్ని వదులుకునేందుకు అతను సిద్ధంగా లేరన్న చర్చ సాగుతోంది.ఈ మధ్య రిటైర్డ్ అయిన ఓ అధికారి పేరును కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఇక మాజీ IAS ఆకునూరి మురళీ, ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, నాగేశ్వర్ పేర్లను పరిశీలించినప్పటికీ.. టీఎస్‌పీఎస్‌సీ నిబంధనల మేరకు వయో పరిమితి సరిపోవడం లేదు.ఒకవేళ ICS అధికారి ఎంపిక వీలుకాకపోతే, ఎగ్జామీనేషన్స్ నిర్వహణలో అనుభవం ఉన్న ప్రొఫెసర్స్ వైపు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపనుంది.