CM KCR : మేడే నాడు పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ కానుక..
నేడు ఉదయం ఆయా శాఖల మంత్రులతో, అధికారులతో చర్చించి సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు జీతం పెంపు నిర్ణయం తీసుకోవడమే కాక నేడే ఆ ఫైల్ మీద సంతకం చేశారు.
- By News Desk Published Date - 07:32 PM, Mon - 1 May 23

తెలంగాణ(Telangana) నూతన సచివాలయం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే పలు కీలక ఫైళ్ల మీద సంతకాలు చేసి తెలంగాణ ప్రజలకు మేలు చేకూరేలా చర్యలు తీసుకున్నారు సీఎం కేసీఆర్(CM KCR). నేడు మేడే(May Day) సందర్భంగా పారిశుద్ధ్య, ఆర్టీసీ(RTC) కార్మికులకు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. నేడు ఉదయం ఆయా శాఖల మంత్రులతో, అధికారులతో చర్చించి సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు జీతం పెంపు నిర్ణయం తీసుకోవడమే కాక నేడే ఆ ఫైల్ మీద సంతకం చేశారు.
తెలంగాణలోని పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు వెయ్యి రూపాయల జీతం పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో GHMC, జలమండలి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల వేతనం పెరగనుంది. ఈ వేతనం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో మే నెల జీతంతోనే ఈ పెంపు కూడా అందుకోనున్నారు కార్మికులు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెరగనున్నాయి.
కార్మికుల దినోత్సవం రోజున ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైల్ పై సంతకం పెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సఫాయన్న నీకు సలాం అనే నినాదంతో పారిశుద్ధ కార్మికుల కష్టాన్ని గుర్తిస్తున్నాం. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి ఒక్క కార్మికుడి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పారిశుద్ధ కార్మికుల వల్లే ఇటీవల మన రాష్ట్రంలోని పల్లెలకు జాతీయ అవార్డులు వచ్చాయి అని అన్నారు.
Also Read : Police Stations: తెలంగాణలో కొత్తగా 40 పోలీస్ స్టేషన్స్!