Dasara : స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు.. ప్రయాణికుల అగ్రహం
Dasara : స్పెషల్ బస్సు ల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు
- By Sudheer Published Date - 07:11 PM, Wed - 9 October 24

దసరా (Dasara) సందర్బంగా TGSRTC స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ స్పెషల్ బస్సుల్లో ( Special Buses) టికెట్ చార్జీల మోత మోగడం తో ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా అనేది పెద్ద పండగ అని చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే దసరా వస్తుందంటే సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా దసరా ను జరుపుకుంటుంటారు.
దసరా పండగకు ముందే బస్సు , ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు. ఒక వేళ టికెట్ దొరకని వారు స్పెషల్ బస్సు లను , ట్రైన్ లను చూసుకుంటారు. ఇక ఈసారి కూడా దసరా సందర్బంగా గత వారం రోజులుగా బస్టాండ్ , రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారు హ్యాపీగా ప్రయాణం చేస్తుంటే..రిజర్వేషన్ చేసుకొని వారు మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక ప్రయాణికుల రద్దీ దృష్ట్యా TGSRTC స్పెషల్ బస్సు లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దసరా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండుగలకు తమ సొంతూళ్లకు వెళ్లే వాళ్లు ఇబ్బంది పడకుండా, వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులు తిప్పుతున్నామని సజ్జనార్ వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉన్నందున, గతేడాదితో పోల్చితే అదనంగా మరో 600 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రద్దీ ఉంటుందని భావిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. కానీ స్పెషల్ బస్సు ల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి నల్గొండకు సాధారణ ఛార్జీ రూ.200 ఉంటే.. ప్రస్తుతం రూ. 250 వసూలు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఊరెళితే.. దాదాపు 200 అదనంగా ఛార్జీలు అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశన్నంటగా.. పండుగ వేళ ఆర్టీసీ అదనపు ఛార్జీలతో తమ జేబులకు చిల్లు పడుతోందని వాపోతున్నారు.
Read Also : AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ సమావేశం…చర్చించే అంశాలు ఇవేనా..?