Yasangi Crop: తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనకపోతే ఒక రైతుకు వచ్చే నష్టం ఎంతో తెలుసా?
- Author : HashtagU Desk
Date : 22-03-2022 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
అదేంటో కాని.. ఈ దేశంలో తన ఉత్పత్తికి ధర నిర్ణయించుకోలేనివారు ఎవరైనా ఉన్నారా అంటే.. అది రైతు ఒక్కడే. అందులోనూ తెలంగాలో ఇప్పుడు ధాన్యం దిగుబడి 70 లక్షల టన్నులకు పైగా వస్తుంది. ఇలాంటప్పుడు కానీ దీనిని కేంద్రం సేకరించకపోతే ఆ రైతుకు మద్దతు ధర కూడా రావడం కష్టమవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల వరికోతలు మొదలయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోపే అవి తారస్థాయిలో ఉంటాయి. అసలు కేంద్రం ఎందుకు వీటిని కొనబోను అంటోంది?
ఉప్పుడు బియ్యం కొనము అని కేంద్రం చెప్పడంతో యాసంగిలో వేరే పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందే చెప్పింది. అయినా సరే.. 35 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు వరి వేశారు. ఇప్పుడా పంట కాని అమ్ముడుపోకపోతే ఎలా అని మధనపడుతున్నారు. ప్రభుత్వమేమో పంజాబ్ తరహాలో కొనాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఊళ్లల్లో కొనుగోలు కేంద్రాలు కాని తెరుచుకోకపోతే .. రైతులకు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు పెరిగిపోతాయి. అలా ఒక్కో క్వింటాకు రూ.100 మేర అదనపు భారం పడుతుంది. పోనీ ప్రైవేటు వారికి అమ్ముదామంటే.. నష్టమే తప్ప లాభం ఉండదని రైతులకు తెలుసు.
రాష్ట్రంలో రైసు మిల్లర్లు 15 నుంచి 20 లక్షల టన్నుల మేర కొనగలరు. ఇతరత్రా అవసరాలకు 15 లక్షల టన్నుల మేర వినియోగిస్తారని అనుకుంటే.. మరి మిగిలిన 40 లక్షలకు పైగా టన్నుల సంగతేంటి? రైతులను, ప్రభుత్వాన్నీ కలవరపరుస్తోంది ఇదే. రాష్ట్రంలో 1-5 ఎకరాల్లోపు సాగుచేసేవారే అధికం. అది కూడా అప్పులతోనే సాగును పూర్తిచేస్తారు. పంట అమ్ముడుపోకపోతే.. అప్పుల భారాన్ని తీర్చుకోవడం కోసం.. పంటను ఎంతకైనా సరే అమ్మేయాలనుకుంటారు. వ్యాపారులకు కావలసింది కూడా అదే. అప్పుడు రైతు క్వింటాకు రూ.200-300 నష్టపోయే అవకాశముంది.
ఒక రైతుకు ఎకరానికి ఎలా లేదన్నా రూ.6,000 నష్టం వచ్చినా.. దాదాపు 35 లక్షల ఎకరాల్లో పంటకు ఈ నష్టాన్ని లెక్కేస్తే ఆ మొత్తం రూ.2,150 కోట్లకు పైగా ఉంటుంది. వచ్చే నెల మొదటివారానికల్లా ధాన్యం మార్కెట్ కు వచ్చేస్తుంది. అంటే ఈ నెలాఖరులోపే కొనుగోలు కేంద్రాలు తెరవాలి. లేదంటే.. రైతులు ఇబ్బంది పడతారు. కానీ ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ అంశంగా మారడంతో మధ్యలో రైతులు నలిగిపోతున్నారు.