IAS Officers Vs CAT : ‘క్యాట్’ తీర్పుపై హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్.. కాసేపట్లో విచారణ
దీనిపై హైకోర్టు (IAS Officers Vs CAT) నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
- By Pasha Published Date - 12:29 PM, Wed - 16 October 24

IAS Officers Vs CAT : తమను ఏపీ క్యాడర్‌కు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం ఇచ్చిన తీర్పును నలుగురు ఐఏఎస్‌లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. బుధవారం రోజు(అక్టోబరు 16) ఏపీకి వెళ్లి విధుల్లో చేరాలని క్యాట్ ఆదేశాలు ఇవ్వడంపై ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారించనుంది. దీనిపై హైకోర్టు (IAS Officers Vs CAT) నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :World Food Day 2024: 73 కోట్ల మంది ఆకలి కేకలు.. వెంటాడుతున్న పోషకాహార లోపం
ఏపీ, తెలంగాణ విభజన జరుగుతున్న టైంలో ఐఏఎస్ అధికారులు ఇరు రాష్ట్రాలకు ఆనాడు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) కేటాయించింది. అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని ఈనెల 9న డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపులూ ఇటీవలే ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణీ ప్రసాద్, డీ రొనాల్డ్‌రాస్, జీ సృజన, హరికిరణ్, శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్‌లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై లతా బస్వరాజ్ పట్నే, శాలినీ మిశ్రాలతో కూడిన క్యాట్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన స్థానాల్లో ఈ నెల 16లోగా విధుల్లో చేరాలని ఐఏఎస్‌లను క్యాట్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పునే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో నలుగురు ఐఏఎస్‌లు సవాల్ చేశారు.
Also Read :Anaesthesia Day 2024 : ‘అనెస్తీషియా’.. రోగుల బాధలు దూరం చేసిన విప్లవాత్మక విధానం
వాస్తవానికి కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఆదేశాల తర్వాత రాజకీయ ప్రక్రియ ద్వారా ఏపీకి తమ బదిలీలను వాయిదా వేయించాలని పలువురు ఐఏఎస్ అధికారులు భావించారట. అయితే తెలంగాణ ప్రభుత్వంలోని ఓ నేత కొందరు ఐఏఎస్‌లను పిలిపించి క్యాట్‌ను ఆశ్రయించాలని సూచించారనే టాక్ వినిపిస్తోంది.క్యాట్‌ను ఆశ్రయించడం ద్వారా డీఓపీటీకి వ్యతిరేకంగా వెళ్తున్నామనే భావన కల్పించినట్టు అయ్యిందని ఇప్పుడు సదరు ఐఏఎస్‌లు భావిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించినా అనుకూల ఫలితం రాకపోవచ్చని అనుకుంటున్నారట.