Formula E Racing Case : ‘ఫార్ములా ఈ కార్ రేస్’ చెల్లింపులతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ కౌంటర్
ఫార్ములా ఈ- కారు రేస్(Formula E Racing Case) 10వ సీజన్ పోటీలు హైదరాబాద్‌లో జరగలేదని ఆయన తెలిపారు.
- By Pasha Published Date - 05:11 PM, Sat - 28 December 24

Formula E Racing Case : ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌కు.. ఇటీవలే ఏసీబీ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందుకు కౌంటర్‌గా ఈరోజు కేటీఆర్ హైకోర్టులో రిప్లై ఇస్తూ అఫిడవిట్‌ను సమర్పించారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఒప్పందాల అమలుతో పాటు డబ్బు చెల్లింపు వ్యవహారంతో తనకు సంబంధం లేదని అఫిడవిట్‌లో కేటీఆర్ ప్రస్తావించారు. ఒప్పందాల అమలుతో ముడిపడిన విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై అనుమతుల అంశాన్ని సంబంధిత బ్యాంకే చూసుకోవాలన్నారు.
Also Read :Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ.. పీకే, రాబిన్ శర్మలతో చంద్రబాబు భేటీ
‘‘ఫార్ములా ఈ-కార్ రేస్ ఒప్పందాలతో ముడిపడిన చట్టపరమైన అంశాలు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోకి వెళ్తాయి. అదేవిధంగా రూ.10 కోట్లు దాటే చెల్లింపులకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదు. నగర, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నాకు ఆ అనుమతులతో సంబంధం లేదు’’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ- కారు రేస్(Formula E Racing Case) 10వ సీజన్ పోటీలు హైదరాబాద్‌లో జరగలేదని ఆయన తెలిపారు. సంబంధిత సంస్థ నుంచి సొమ్ము రీఫండ్‌ను కోరవచ్చని కౌంటర్ అఫిడవిట్‌లో కేటీఆర్ ప్రస్తావించారు.
Also Read :Formula E Race Case : ఫార్ములా ఈ రేసింగ్ కేసు వివరాలు ఈడీకి అప్పగించిన ఏసీబీ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సహా పలువురు ప్రభుత్వ నిధుల దుర్వియోగం, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ తెలంగాణ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు రూ.55 కోట్లు బదిలీ చేశారని ఆరోపించింది. అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేసి హెచ్ఎండీఏకు రూ.8 కోట్లు అదనపు భారం పడేలా చేశారని కోర్టుకు ఏసీబీ తెలిపింది. తనపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను క్వాష్ చేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ వాదించింది.