Jagruthi Janam Bata : భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను – కవిత
Jagruthi Janam Bata : “సామాజిక తెలంగాణ సాధనమే మా లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మా అజెండా కంటే ముఖ్యమైనవి. ఎవరైనా మా ఆలోచనలను అంగీకరించకపోయినా, వారిని కూడా స్వాగతిస్తాం
- By Sudheer Published Date - 02:45 PM, Tue - 4 November 25
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న “జాగృతి జనం బాట” కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ పర్యటనలో ఆమె ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను అన్వేషించారు. “సామాజిక తెలంగాణ సాధనమే మా లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మా అజెండా కంటే ముఖ్యమైనవి. ఎవరైనా మా ఆలోచనలను అంగీకరించకపోయినా, వారిని కూడా స్వాగతిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నిసమస్యలు పరిష్కరమయ్యాయి కానీ ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. అందుకే ఈ నాలుగు నెలలపాటు ప్రజల్లో తిరిగి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటాం” అని తెలిపారు.
Operation Kagar : 20 ఏళ్లకే మావోయిస్టు గా మారిన యువతీ..కట్ చేస్తే రూ.14 లక్షల రివార్డు
కవిత ప్రత్యేకంగా పత్తి రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రైతులు మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారని, కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. పత్తి రైతులకు తేమ శాతం ఆధారంగా తక్కువ ధర ఇవ్వడం అన్యాయమని పేర్కొంటూ, “రైతు యార్డ్‌కి పత్తి తీసుకురాగానే కాకుండా, అది ఆరిన తర్వాత తేమ శాతం చూసి కొనాలి” అని అన్నారు. కలెక్టర్‌తో ఈ విషయంపై చర్చించి పరిష్కారం సాధించినట్టు తెలిపారు. అలాగే చనాఖా-కొరటా, కుప్తి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. “మహారాష్ట్రలో బండ్లు కట్టారు కానీ మన వైపు నిర్లక్ష్యం. 50 వేల ఎకరాలకు నీరు అందించగల ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి కావాలి” అని డిమాండ్ చేశారు. ఆదివాసీల భూమి సమస్య, బోథ్‌లో మౌలిక వసతులు, ఆస్పత్రులు, విద్యా సంస్థల సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జైనత్ దేవాలయం అభివృద్ధి, రైల్వే బ్రిడ్జిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై కూడా కవిత సూటిగా స్పందించారు. “బీజేపీ నాయకులు ఎన్నికల సమయంలో దేవుళ్ల పేర్లు తీసుకుంటారు కానీ ఆలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు” అని విమర్శించారు. విద్యా రంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ కాలేజీలు బంద్ చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు, మహిళల సాధికారత, ఆరోగ్య సదుపాయాల లోపం వంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. “నాలుగు నెలల్లో ప్రజలతో కలసి తిరిగి కనీసం నాలుగు ప్రధాన సమస్యలైనా పరిష్కారం చేయగలిగితే మా జీవితం ధన్యమవుతుంది. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పునరుద్ధరణ ప్రారంభమైంది” అని కవిత స్పష్టం చేశారు.