కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?
ఇప్పటివరకు కేసీఆర్ నీడలో, పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేసిన ఆమె, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తన 'జాగృతి' సంస్థ నుంచి కేసీఆర్ ఫోటోలను తొలగించడం, కుటుంబ వివక్షను బహిరంగంగా ఎండగట్టడం ద్వారా ఆమె ఒక సానుభూతి అస్త్రాన్ని (Sympathy factor) ప్రయోగించారు
- Author : Sudheer
Date : 06-01-2026 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
- శాసనమండలిలో కవిత కన్నీరు
- మాది ఆస్తుల పంచాయితీ కాదు , ఆత్మాభిమానం పంచాయితీ
- “రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను”
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తీసుకున్న తాజా నిర్ణయం ఒక పెను సంచలనానికి తెరలేపింది. శాసనమండలి వేదికగా ఆమె కన్నీటి పర్యంతమవుతూ చేసిన ప్రకటన, కేవలం ఒక భావోద్వేగ సంఘటన మాత్రమే కాదు, అది బిఆర్ఎస్ (BRS) పార్టీ పునాదులను కదిలించే ఒక రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. తన సొంత కుటుంబంతో, ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలోని రాజకీయ బంధాలతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారా ఆమె ఒక స్పష్టమైన గీతను గీశారు. “రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను” అని ఆమె చేసిన ఛాలెంజ్, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కవిత ఇప్పుడు ఒక ‘స్వతంత్ర రాజకీయ శక్తి’గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ నీడలో, పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేసిన ఆమె, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తన ‘జాగృతి’ సంస్థ నుంచి కేసీఆర్ ఫోటోలను తొలగించడం, కుటుంబ వివక్షను బహిరంగంగా ఎండగట్టడం ద్వారా ఆమె ఒక సానుభూతి అస్త్రాన్ని (Sympathy factor) ప్రయోగించారు. రాజకీయాల్లో సానుభూతికి ఉండే బలం చాలా గొప్పది. తనను కుటుంబం ఒంటరిని చేసిందని ప్రజల ముందు కన్నీరు పెట్టుకోవడం ద్వారా మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలనేది ఆమె పక్కా వ్యూహంగా కనిపిస్తోంది.
కవిత తీసుకున్న ఈ నిర్ణయం బిఆర్ఎస్ పార్టీకి ఒక గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుతానికి సొంతంగా భారీ విజయాలు సాధించలేకపోయినా, ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చగల సామర్థ్యం ఆమెకు ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎదురుదెబ్బలు తింటున్న తరుణంలో, కవిత చీల్చే 2-3 శాతం ఓట్లు కూడా పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయి. ఆమె ప్రభావం ఎంత పెరిగితే, బిఆర్ఎస్ పతనం అంత వేగవంతం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి, తనను అవమానించిన పార్టీపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా కవిత వేస్తున్న అడుగులు, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.