Hydra : మరోసారి హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు..
హైదర్‌నగర్ సర్వే నెంబర్ 145లో 9 ఎకరాలు 27 గుంటల భూమిపై ఉన్న డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లో, 2000వ సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలం తనదంటూ శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి దానిని ఆక్రమించాడు.
- By Latha Suma Published Date - 11:14 AM, Mon - 19 May 25

Hydra:హైడ్రా అధికారులు కూకట్‌పల్లి మండల పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్‌లో ఉన్న డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌ను అక్రమ ఆక్రమణదారుల చెర నుంచి తిరిగి విడిపించింది. ఈ చర్యతో గత కొన్ని సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న 79 మంది మధ్యతరగతి ప్లాట్ యజమానులకు ఊరట లభించింది. హైదర్‌నగర్ సర్వే నెంబర్ 145లో 9 ఎకరాలు 27 గుంటల భూమిపై ఉన్న డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లో, 2000వ సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలం తనదంటూ శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి దానిని ఆక్రమించాడు. ఈ ఆక్రమణకు చట్టబద్ధత కల్పించుకునేందుకు హైకోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాడు.
Read Also: Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?
కానీ ప్లాట్ యజమానులు దీనిపై పోరాటం కొనసాగిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరికి 2024 సెప్టెంబరులో హైకోర్టు తీర్పు బాధితులకు అనుకూలంగా వచ్చి, ఆ స్థలంపై హక్కు వారి కాదని, అసలు యజమానులకేనని తేల్చింది. అయినప్పటికీ ఆక్రమణదారులు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో, బాధితులు ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు, సోమవారం ఉదయం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపును ప్రారంభించారు. బుల్డోజర్ల సహాయంతో కబ్జాదారులు నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. ఈ చర్యలు ఆ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపాయి.
ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. “ఇన్ని సంవత్సరాలుగా మన హక్కుల కోసం పోరాడుతున్నాం. చివరకు న్యాయం జరిగింది. హైడ్రా చర్యలతో మాకు పునర్జన్మ లభించినట్లుగా ఉంది” అని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలను అడ్డుకునే దిశగా అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం స్పష్టమవుతోంది. హైకోర్టు తీర్పుల అమలులో గడ్డు నిర్ణయాలు తీసుకోవడంలో హైడ్రా చూపిన దృఢత అభినందనీయం.
Read Also: YS Sharmila : ఆమరణ దీక్షకు దిగుతా.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన