Hyderabad : హైదరాబాద్ అడ్డాగా ఉగ్రకుట్రకు ప్లాన్
Hyderabad : గుజరాత్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఆదివారం నాడు నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన
- By Sudheer Published Date - 10:50 AM, Mon - 10 November 25
గుజరాత్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఆదివారం నాడు నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ కావడం కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వైద్యుడు ఉగ్రవాద సిద్ధాంతాలకు లోనై, ప్రమాదకర రసాయనాలను తయారుచేసినట్లు విచారణలో బయటపడింది. మిగతా ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్, ఆజాద్ సులేమాన్ షేక్‌లుగా గుర్తించారు. అదాలత్ టోల్ ప్లాజా వద్ద వీరిని పట్టుకున్న ఏటీఎస్, వారి వద్ద నుంచి తుపాకులు, రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకుంది.
Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి
డాక్టర్ అహ్మద్ తన నివాసాన్ని ప్రయోగశాలగా మార్చుకుని, ఆముదం గింజలను ప్రాసెస్ చేసి వాటి వ్యర్థాలతో “రైసిన్” అనే అత్యంత ప్రమాదకర విషపదార్థాన్ని తయారుచేసినట్లు అధికారులు వెల్లడించారు. రైసిన్ కేవలం తక్కువ మోతాదులోనే ప్రాణాంతకమని, ఇది బయో టెర్రర్ ఆయుధంగా పరిగణించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డాక్టర్ తయారు చేసిన రసాయనాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయాలని కుట్రపన్నారని విచారణలో తేలింది. సలీంఖాన్, సులేమాన్‌లు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ సరిహద్దు మీదుగా ఆయుధాలు సరఫరా చేసుకుంటున్నట్లు ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా వీరు పరిచయమై, ఉగ్రవాద గ్రూప్‌గా ఏర్పడి, దేశవ్యాప్తంగా విధ్వంసానికి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
ఇక అరెస్టైన ఆజాద్ కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఆజాద్ సోదరుడు షెహజాద్ ప్రకారం, అతని సోదరుడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని తెలిపారు. అదే విధంగా ఆజాద్ తండ్రి సులేమాన్ మాట్లాడుతూ, తన కుమారుడు మదర్సాలో చదువుతున్న శ్రద్ధావంతుడని, ఇటీవల కుటుంబాన్ని కలిసేందుకు బయలుదేరి తిరిగి రాలేదని వివరించారు. అయితే, ఏటీఎస్ మాత్రం సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, ఉగ్రవాద కుట్రను అడ్డగట్టామని చెబుతోంది. హైదరాబాద్ డాక్టర్ పాల్గొన్న ఈ ఘటన దేశ భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. వైద్యుడి వృత్తి ముసుగులో దాగి ఉన్న ఈ ఉగ్ర నెట్‌వర్క్‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేసేందుకు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.