Fire Accident : పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. 40 దుకాణాలు దగ్ధం
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని 40కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
- By Kavya Krishna Published Date - 09:44 AM, Mon - 10 February 25

Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని దివాన్‌దేవిడి ప్రాంతంలో ఉన్న మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బందిచే అందిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం అర్ధరాత్రి 2:15 గంటల సమయంలో ప్రారంభమైంది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీ స్థాయిలో వ్యాపించడంతో మదీనా సర్కిల్ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మొదట భవనంలోని ఒక మూల షాప్‌లో మంటలు చెలరేగగా, అవి క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, భవనం ఇరుకుగా ఉండటంతో లోనికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టడంలో అగ్నిమాపక సిబ్బందికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Manipur CM Resignation: మణిపూర్‌లో సంచలన పరిణామం.. సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా
ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి వెంకన్న స్పందిస్తూ, తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రమాద సమాచారం అందిందని, వెంటనే స్పందించి 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న దుకాణాలు పూర్తిగా కాలిపోయాయని, అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర ఏదైనా కారణమా అనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు.
మంటల తీవ్రత కారణంగా భవనంలోని స్లాబ్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. దుకాణాల్లో ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోయాయి, ఫలితంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటన పాతబస్తిలో తీవ్ర కలకలం రేపుతోంది.
Rohit Sharma Century: రోహిట్.. 16 నెలల తర్వాత సెంచరీతో విధ్వంసం