DH Srinivasa Rao: వివాదంలో హెల్త్ డైరెక్టర్.. కేసీఆర్ పై భక్తిని చాటుకునేలా ఉత్తర్వులు జారీ!
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు (DH Srinivasa Rao) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
- By Balu J Published Date - 11:48 AM, Fri - 17 February 23

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు (DH Srinivasa Rao) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం (KCR Birthday) సందర్భంగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలంటూ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఓ ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడల తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ సీఎం కేసీఆర్ కు శ్రీనివాసరావు పాదాభివందనం చేశారు.. విమర్శలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ టికెట్ (Ticket) ఆశిస్తున్న శ్రీనివాసరావు (DH Srinivasa Rao) కెసిఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకే రాజభక్తి ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల తరచు ఆయన కొత్తగూడెం వస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పాల్వంచ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
మరొకటి వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న గడల (DH Srinivasa Rao) జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించారు. అది కూడా కార్పొరేట్ ఆసుపత్రులతో.. ప్రజారోగ్య శాఖకు సంచాలకుడిగా ఉన్న శ్రీనివాసరావు… కార్పొరేటర్ ఆస్పత్రులతో వైద్య శిబిరాలు నిర్వహించడం ఏంటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కెసిఆర్ జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
Also Read: Gaalodu: ఆహాలో సుడిగాలి సుధీర్ మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ `గాలోడు`.